హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : మహిళల కోసం ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఏర్పాటుచేయనున్నట్టు మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. వీటిలో గ్రామీణ మహిళలకు ప్రాధాన్యమివ్వనున్నట్టు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ‘ఫుడ్ ఏ ఫెయిర్’ రెండో ఎడిషన్ బ్రోచర్‌ను మంత్రి ఆవిషరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీ, ఫార్మా మాదిరిగానే వ్యవసాయ, వ్యవసాయాధారిత రంగాల్లోనూ తెలంగాణను ప్రథమస్థానంలో నిలుపడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఫుడ్‌ప్రాసెసింగ్ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు ఉన్న ట్టు తెలిపారు. ఇప్పటికే ఈ రంగంలో రూ.16 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, అవి వివిధ దశల్లో ఉన్నట్టు చెప్పారు. రాష్ట్రంలో 7,150 ఎకరాల్లో 14 స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఉన్నాయని, రానున్న రోజుల్లో ద్వితీయ, తృతీయశ్రేణి నగరాలు, పట్టణాల్లోనూ ఏర్పాటుచేస్తామని తెలిపారు. 6,800కు పైగా మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయని, కొత్తగా ఏర్పాటుచేసే ఔత్సాహికులకు ప్రభుత్వం ఆర్థికంగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ కమిషనర్ మల్సూర్, తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ డైరెక్టర్ అఖిల్, ఫుడ్ ఏ ఫెయిర్ నిర్వాహకులు శ్రీకాంత్, టీజీ శ్రీకాంత్, విశాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.