హైదరాబాద్, సెప్టెంబర్ 14: స్పెయిన్కు చెందిన బహుళజాతి ఔషధ రంగ సంస్థ ఇన్సూడ్ ఫార్మా గురువారం హైదరాబాద్ లోని జినోమ్ వ్యాలీలో ఒలిగోన్యూక్లియో టైడ్ పరిశోధన ఉత్పాదక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గత ఏడాది దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా కీమో, ఇన్సూడ్ సంస్థల ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా హైదరాబాద్లో విస్తరణపై సంస్థలు ముందుకొచ్చాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ సెంటర్ను ఇన్సూడ్ తీసుకొచ్చింది. ఒలిగోన్యూక్లియోటైడ్ అనేది మెడికల్ టెక్నాలజీలో అత్యాధునికం. ఈ డ్రగ్స్ న్యూరోడీజనరేటివ్ వంటి వ్యాధుల చికిత్సకు వినియోగిస్తారు. కాగా, ఈ కేంద్రానికి అమెరికా ఔషధ రంగ నియంత్రణ మండలి (యూఎస్ఎఫ్డీఏ), స్పెయిన్ హెల్త్ ఏజెన్సీ, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇతర అంతర్జాతీయ సంస్థల అనుమతులున్నాయి.