Star Link to Indian Rural Market | గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈవో ఎలన్‌మస్క్ సారధ్యంలోని స్పేస్ఎక్స్ అనుబంధ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ విభాగం స్టార్ లింక్ భారత్ మార్కెట్లో అడుగు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నది. తొలుత దేశంలోని గ్రామీణ లోక్‌సభ స్థానాలను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు స్టార్ లింక్ భారత్ డైరెక్టర్ సంజయ్ భార్గవ చెప్పారు. త్వరలో తాను స్వయంగా ఎంపీలు, మంత్రులు, వివిధ ప్రభుత్వశాఖల కార్యదర్శులతో చర్చిస్తామని తెలిపారు. ముందుగా 10 గ్రామీణ లోక్‌సభ సెగ్మెంట్లపై ఫోకస్ చేశామన్నారు.
భారత్‌కు వచ్చే టర్మినళ్లలో 80 శాతం గ్రామీణ లోక్సభాస్థానాలకు కేటాయించాలని యోచిస్తున్నట్లు సంజయ్ భార్గవ వెల్లడించారు. అయితే, దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉందన్నారు. 2022 డిసెంబర్ నుంచి రెండు లక్షల టర్మినళ్లతో బ్రాడ్‌బ్యాండ్ సేవలు ప్రారంభించాలని స్టార్ లింక్ భావిస్తున్నది. దీనికి ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాలి.
ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు ఆర్డర్లు 5,000 దాటాయని, గ్రామీణ ప్రాంతాలకు సేవలందించాలని స్టార్ లింక్ భావిస్తున్నది. బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలతో స్టార్‌లింక్ పోటీపడనుంది. భారతీ గ్రూప్‌నకు చెందిన వన్‌వెబ్‌తో ప్రత్యక్ష పోటీ నెలకొనే అవకాశం ఉంది.