SGB | న్యూఢిల్లీ, మే 3: గోల్డ్ బాండ్ ఇన్వెస్టర్లకు జాక్పాట్ తగిలింది. ఎనిమిదేండ్ల క్రితం సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ)లో పెట్టుబడులు పెట్టిన మదుపరులకు నిజంగానే సువర్ణావకాశం వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2017-18 సిరీస్ 1 ఎస్జీబీల కోసం తుది ధరను తాజాగా ప్రకటించింది. దీంతో వీటిని కొన్నవారికి ఏకంగా 221 శాతానికిపైగా లాభాలు దక్కుతున్నాయి.
2017 మే నెలలో ఎస్జీబీ 2017-18 సిరీస్ 1 వచ్చింది. అప్పుడు గ్రాము ధరను రూ.2,951గా నిర్ణయించి ఆర్బీఐ బాండ్లను విక్రయించింది. ఆన్లైన్లో కొన్నవారికైతే మరో రూ.50 రాయితీ కూడా ఇచ్చింది. దీంతో వీరందరికి రూ.2,901కే లభించాయి. అయితే ఈ బాండ్ల కాలవ్యవధి 8 ఏండ్లు పూర్తవడంతో ప్రస్తుతం ఇవి మెచ్యూరిటీకి వచ్చాయి. దీంతో ఆర్బీఐ గ్రాము బంగారం ధరను రూ.9,486గా నిర్ణయించింది. ఫలితంగా నాడు కొన్న ధరతో చూస్తే ఒక్క గ్రాముపై మదుపరులకు రూ.6,535 లాభం దక్కుతున్నది. ఆన్లైన్లో కొన్నవారికి రూ.6,585 రాబడి వస్తున్నది. ఇది 221 శాతానికిపైగా లాభాలను సూచిస్తున్నది. వార్షిక వడ్డీ 2.5 శాతం ఆదాయాన్నీ కలుపుకొంటే లాభాలు మరింతగా పెరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే అప్పట్లో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినవారికి ఇప్పుడు రూ.3 లక్షలకుపైగానే చేతికొస్తున్నాయి. బంగారం ధరలు పరుగులు పెడుతుండటంతో మదుపరులకు పెద్ద ఎత్తున లాభాలు వస్తున్నాయి. గత నెల 22న మునుపెన్నడూ లేనివిధంగా లక్ష రూపాయల మార్కును దాటి తులం రూ.1,01,600 పలికిన విషయం తెలిసిందే. ఇది గోల్డ్ బాండ్ ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది.
ఎస్జీబీ 2017-18 సిరీస్ 1 విమోచనానికి ఈ నెల 9 ఆఖరు తేదీ. దీంతో గత నెల 28-ఈ నెల 2 తేదీల (సోమవారం-శుక్రవారం) మధ్యగల వారాన్ని ధరల నిర్ణయానికి ప్రాతిపదికగా ఆర్బీఐ తీసుకున్నది. ఎప్పుడైనాసరే విమోచనానికి ఆఖరు తేదీ (మే 9)ని నిర్ణయించిన వారాని (ఈసారి మే 5-9)కి ముందున్న వారాన్ని ధర ప్రకటనకు పరిగణనలోకి తీసుకుంటారు. ఈ క్రమంలోనే గడిచిన వారం (ఏప్రిల్ 28-మే 2)లో భారతీయ బులియన్, జ్యుయెల్లర్స్ అసోసియేషన్ లిమిటెడ్ 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) గోల్డ్కుగాను ప్రకటించిన ధరల్లో చివరి మూడు రోజుల ధరల సాధారణ సగటు ఆధారంగా ధరను నిర్ణయించారు. మే 1 సెలవు దినం కావడంతో ఏప్రిల్ 29, 30, మే 2 తేదీల ధరల సగటును చూసి రూ.9,486గా ప్రకటించారు. బాండ్లను జారీ చేసేటప్పుడు కూడా ఇదే ప్రాతిపదికన ధరను నిర్ణయించి ఆర్బీఐ వాటిని అమ్మకానికి పెడుతుంది. ఇక ఎస్జీబీల్లో పెట్టుబడులపై పొందే లాభాలకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది.