Omicron in South Africa | కరోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్ దక్షిణాఫ్రికాలో వేగంగా వ్యాపిస్తున్నది. రోజురోజుకు నమోదవుతున్న కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఒమిక్రాన్ పలు దేశాలకు విస్తరించడంతో ఆయా దేశాలు దాని కట్టడికి చర్యలు చేపట్టాయి. న్యూ వేరియంట్ కేసులు పెరుగుతున్నా వ్యాధి తీవ్రతతో దవాఖానల్లో చేరే వారి సంఖ్య తక్కువేనని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా చెప్పారు.
దీనివల్ల ఆందోళనకర పరిస్థితులు తలెత్తే పరిస్థితులు కనిపించట్లేదన్నారు. దక్షిణాఫ్రికా పౌరుల ప్రయాణాలపై వివిధ దేశాలు ఆంక్షలు విధించడాన్ని రమఫోసా తప్పుబట్టారు. న్యూ వేరియంట్ వ్యాప్తి అవకాశాలపై పరిశోధనలు జరుపాల్సి ఉందన్నారు. ఒమిక్రాన్ కేసులు వేగంగా వ్యాపిస్తున్నా ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని దక్షిణాఫ్రికా ఆరోగ్య మంత్రి జో ఫాహ్లా చెప్పారు. దవాఖానల్లో చేరిన వారిలో వైరస్ లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయన్నారు.
దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసినప్పటి నుంచి అక్కడ యాక్టివ్ కేసులు భారీగా పెరిగాయి. ఒమిక్రాన్ బయటపడే నాటికి దక్షిణాఫ్రికాలో 19 వేల యాక్టివ్ కేసులు ఉంటే, గత నెలాఖరు నాటికి 75 వేలకు పెరిగింది. దీని వ్యాప్తి రేటు ఎక్కువ ఉన్నందున దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆందోళనకర వేరియంట్ అని ప్రకటించింది.