హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ సేవల సంస్థ సోనాటైప్.. హైదరాబాద్‌లో ఇన్నోవేషన్ హబ్‌ను సోమవారం ప్రారంభించింది. అంతర్జాతీయ వ్యాపార విస్తరణలో భాగంగా భారత్‌లో ఏర్పాటు చేసిన తొలి ఇన్నోవేషన్ హబ్ ఇదే కావడం విశేషం. ఏఐ ఇన్నోవేషన్ విభాగాన్ని బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న సంస్థకు ఈ సెంటర్ దోహద పడనున్నదని కంపెనీ సీఈవో భగవత్ స్వరూప్ తెలిపారు.
ప్రస్తుతం ఈ సెంటర్లో 100 మంది వరకు ఇంజినీర్లు, ప్రొడక్ట్ డెవలపర్లు, డాటా సైంటిస్ట్‌లు, ఏఐ నిపుణులు విధులు నిర్వహిస్తుండగా, వచ్చే ఏడాది చివరినాటికి ఈ సంఖ్యను 200కి పెంచుకోనున్నట్టు ఆయన ప్రకటించారు. హైదరాబాద్‌లో ఐటీ నిపుణులకు కొదవ లేదని, ప్రతిభావంతులు అత్యధికంగా లభిస్తున్నది ఇక్కడేనని చెప్పారు. ఇప్పటికే సంస్థకు ఫల్టన్, మేరిల్యాండ్, ఆస్ట్రేలియా, కొలంబియాలో కార్యాలయాలు ఉన్నాయి.