Ola Electric | సాఫ్ట్ బ్యాంక్ బ్యాక్డ్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric)’ కీలక నిర్ణయం తీసుకున్నదని తెలుస్తోంది. త్వరలో ఐపీఓ ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అయ్యేందుకు సిద్ధమైన ఓలా ఎలక్ట్రిక్.. తన ఎలక్ట్రిక్ కారు (Electric Car)’ ఆవిష్కరణ ప్రణాళికలకు ఫుల్ స్టాప్ పెట్టేసిందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇక నుంచి ఈ-స్కూటర్, ఈ-మోటార్ సైకిల్స్ తయారీపై మాత్రమే దృష్టిని కేంద్రీకరిస్తుందని ఆ వర్గాల కథనం. కనీసం రెండేండ్ల పాటు ఓలా ఎలక్ట్రిక్ కార్ల ప్రాజెక్టును పక్కన బెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈవీ టూ వీలర్స్, బ్యాటరీల తయారీపైనే ఓలా ఎలక్ట్రిక్ ఫోకస్ చేయనున్నది.
ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్ (Ola Electric Founder) భవిష్ అగర్వాల్ (Bhavish Agarwal).. ఆల్ గ్లాస్ రూఫ్ తో ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును ఆవిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు 2022లో చెప్పారు. కేవలం నాలుగు సెకన్లలోనే 100 కి.మీ వేగంతో దూసుకెళ్లే వేగంతో తమ స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ కారు రూపొందిస్తామని కూడా తెలిపారు. గతేడాది సెప్టెంబర్ లోనూ ఫోర్బ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ భవిష్ అగర్వాల్ (Bhavish Agarwal) తన ఎలక్ట్రిక్ కారు ప్రణాళికను పునరుద్ఘాటించారు. అయితే వచ్చేనెలలో ఐపీఓకు వెళ్లేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తన కార్ల తయారీ ప్రణాళికను పక్కన బెట్టిందని తెలుస్తున్నది. ఐపీఓ ద్వారా 600 మిలియన్ డాలర్ల నిధులు సేకరించాలని ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తల పెట్టింది.
తమ దృష్టంతా ఎలక్ట్రిక్ మోటారు సైకిళ్లతోపాటు ఈ-స్కూటర్లపైనే ఉందని ఓలా ఎలక్ట్రిక్ వర్గాలు తెలిపాయి. సామూహిక విద్యుద్దీకరణకు కొంత టైం పడుతుందని, చార్జింగ్ మౌలిక వసతులు అవసరం అని ఆ వర్గాల కథనం. ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వృద్ధి ప్రాథమిక దశలో ఉండటంతోపాటు చార్జింగ్ మౌలిక వసతుల కల్పనలో వైఫల్యం వంటి సవాళ్లను అధిగమించాల్సి ఉందని ఆ వర్గాలు తెలిపాయి. దీనికి తోడు టాటా మోటార్స్ (Tata Motors)తోనే ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ఢీ కొట్టాలన్న వ్యూహంతో ఓలా ఎలక్ట్రిక్ ఉంది. దీనిపై స్పందించేందుకు ఓలా ఎలక్ట్రిక్ నిరాకరించింది.