న్యూఢిల్లీ, మే 21: స్మార్ట్ఫోన్ల ధరలకు రెక్కలొచ్చాయి. గడిచిన ఆరు నెలల్లో వీటి ధరలను 20 శాతం నుంచి 30 శాతం వరకు పెంచిన మొబైల్ తయారీ సంస్థలు.. మరో దఫా పెంచడానికి సిద్ధమవుతున్నాయి. దేశవ్యాప్తంగా మెమరీ చిప్‌ల ధరలు భారీగా పెరుగడంతో స్మార్ట్ఫోన్ల రేట్లనూ మరోసారి పెంచడానికి రెడీ అవుతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు ప్రధాన కారణం మెమరీ చిప్‌లు ఖరీదెక్కడమేనని ఇండియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ సెమికండక్టర్ అసోసియేషన్ (ఐఈఎస్ఏ) ప్రెసిడెంట్ అశోక్ చందక్ అన్నారు. మెమరీ కార్డు తయారీ సంస్థలు భారత్‌లో ప్లాంట్లు పెట్టడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని, దీంతో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని చెప్తున్నారు.
ఇక్కడ చిప్‌లను తయారు చేయడానికి భారీగా ఖర్చవుతున్నదని, అంతర్జాతీయ చిప్ తయారీ దిగ్గజాలు పేర్కొంటున్నాయి. మరోవైపు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకుతోడు రూపాయి మారకం విలువ పాతాళంలోకి పడిపోతుండటంతో మొబైల్ తయారీ సంస్థలూ తమపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయా మాడళ్ల ధరలను సవరించేస్తున్నారు. మరోవైపు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు.. దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపనున్నాయని, ఎలక్ట్రానిక్స్ రంగంపైనా ఆ ప్రభావం ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
స్మార్ట్ఫోన్ల ధరలు భగ్గుమనడంతో అమ్మకాలు భారీగా పడిపోయాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థలైన సామ్సంగ్, వివో, ఒప్పోలు తమ ఫోన్ల ధరలను 14 శాతం నుంచి 22 శాతం వరకు సవరించడంతో కొనుగోలుదారులు జంకుతున్నారు. దీంతో గడిచిన ఆరు నెలల్లో అమ్మకాలు 18 శాతం వరకు పడిపోయాయని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఉత్పాదక వ్యయం పెరిగినందునే తప్పనిపరిస్థితుల్లో వినియోగదారులపై భారం వేయాల్సి వస్తున్నదని ఏఐఎంఆర్ఏ ఫౌండర్, చైర్మన్ కైలేష్ లఖ్యాని వివరించారు. రూ.10 వేలలోపు వుండే స్మార్ట్ఫోన్ల ధరల్ని 10 శాతం వరకు సవరించిన సంస్థలు.. రూ.10-18 వేల శ్రేణి మొబైల్స్‌పై 28 శాతం, రూ.30 వేలు మించి విలువైన ఫోన్లపై 25-36 శాతం వరకు ధరల్ని పెంచేశాయి.
