న్యూఢిల్లీ, జూన్ 14: స్మార్ట్ఫోన్ల తయారీలో భారత్ దూసుకుపోతున్నది. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ల ఉత్పత్తిలో ఎప్పట్నుంచో ముందున్న దేశాలకు సైతం లేని గిరాకీ ఇప్పుడు భారత్‌కు ఉంటున్నది మరి. ఈ క్రమంలోనే ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మాన్యుఫ్యాక్చరింగ్ ఔట్పుట్ క్షీణిస్తున్నా.. భారత్‌లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫలితంగా 2025 బిగ్ విన్నర్‌గా ఇండియానే కాగలదన్న విశ్వాసాన్ని ఓ తాజా నివేదిక వెలిబుచ్చింది. కౌంటర్‌పాయింట్ రిసెర్చ్ ఈ రిపోర్టును విడుదల చేసింది. గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మాన్యుఫ్యాక్చరింగ్ అల్లోకేషన్ ట్రాకర్ ప్రకారం ఈ నివేదిక రూపొందింది.
దేశంలో స్మార్ట్ఫోన్ల తయారీ వెనుక యాపిల్, సామ్సంగ్లే ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇతర దేశాల్లో ఈ ఫోన్లకున్న డిమాండ్.. ఎగుమతులకు దోహదం చేస్తున్నది. ఆయా కంపెనీల స్మార్ట్ఫోన్లు భారత్‌లో తయారై విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మాన్యుఫ్యాక్చరింగ్ ఔట్పుట్ గత ఏడాదితో పోల్చితే 1% పడిపోవచ్చని అంచనాలున్నా.. ప్రపంచ ఉత్పత్తిలో రెండంకెల వృద్ధితో 20 శాతం వాటాను భారత్ సొంతం చేసుకోగలదన్న ఆశాభావం వ్యక్తమవుతున్నది. నిజానికి నిరుడు 4% వృద్ధి నమోదైంది. కానీ అమెరికా ప్రతీకార సుంకాలు, ఇండస్ట్రీలో మందగమనం.. తయారీని ప్రభావితం చేస్తున్నది.
గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా తయారైన స్మార్ట్ఫోన్లలో 90 శాతానికిపైగా చైనా, భారత్, వియత్నాంలలోనే ఉత్పత్తి అయ్యాయి. ఇందులో భారత్ ఆకర్షణీయమైన వృద్ధిరేటును కనబర్చింది. ఇక ఈ ఏడాది ట్రంప్ టారిఫ్‌లతో చైనాలో స్మార్ట్ఫోన్ల తయారీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సుంకాల భారం, భయాలతో యాపిల్, సామ్సంగ్సహా చాలా కంపెనీలు ఆ దేశంలో ఉత్పత్తిని తగ్గించి ప్రత్యామ్నాయంగా భారత్‌ను ఎంచుకుంటున్నాయి.
వియత్నాం పరిస్థితి కూడా ఇంచుమించుగా చైనా తరహాలోనే ఉన్నది. దీంతో భారత్‌లో స్మార్ట్ఫోన్ల తయారీ ఊపందుకున్నదని కౌంటర్‌పాయింట్ రిసెర్చ్ సీనియర్ అనలిస్ట్ ఇవాన్ లామ్ అన్నారు. కాగా, అంతర్జాతీయంగా ఉన్న సంప్రదాయ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ (ఈఎంఎస్) దిగ్గజ సంస్థలు భారత్‌లో తమ పెట్టుబడుల్ని కొనసాగిస్తున్నాయని, స్థానిక ఈఎంఎస్ కంపెనీలూ వీటికి తోడవడంతో భారత్‌లో తయారీ ప్రమాణాలు గతంతో పోల్చితే ఎంతో మెరుగయ్యాయని కౌంటర్‌పాయింట్ రిసెర్చ్ సీనియర్ విశ్లేషకుడు ప్రచిర్ సింగ్ అన్నారు.