హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): ఏటీఎంలలో రూ.500 నోట్లతోపాటు చిన్న నోట్లు (రూ.200, రూ.100 నోట్లు) కూడా ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయి. రూ.500 నోట్లను రద్దు చేస్తున్నట్టు ఇటీవల మీడియా, సోషల్ మీడియాల్లో వార్తలు చక్కర్లు కొట్టిన నేపథ్యంలో ఇది ప్రాధాన్యంగా మారింది.
నిజానికి ఈ అంశంపై ఇటీవలే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. రూ.500 నోట్లను రద్దుచేసే యోచనదీ లేదని.. అయినప్పటికీ ఏటీఎంల ద్వారా చిన్న నోట్ల చలామణిని పెంచుతున్నట్టు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
ప్రజల అవసరాల దృష్ట్యానే ఇదంతా అని వివరించారు. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ 30నాటికి కనీసం 75 శాతం ఏటీఎంలు, వచ్చే ఏడాది మార్చి 31కల్లా 90 శాతం బ్యాంకుల్లో తప్పనిసరిగా రూ.100, రూ.200 నోట్లు కూడా అందుబాటులో ఉంచాలని ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.