Skoda Kylaq | ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా తన కంపాక్ట్ ఎస్యూవీ కారు కైలాక్ (Kylaq)ను బుధవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.7.89 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. బుకింగ్స్ వచ్చేనెల రెండో తేదీ నుంచి ప్రారంభం అవుతుండగా, వచ్చే ఏడాది జనవరి 27 నుంచి డెలివరీలు మొదలు పెట్టనున్నది. ప్రస్తుతం భారత్ మార్కెట్లో ఉన్న కంపాక్ట్ ఎస్యూవీ కార్లు హ్యుండాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజా, మహీంద్రా 3ఎక్స్ఓ వంటి కార్లకు స్కోడా కైలాక్ గట్టి పోటీ ఇవ్వనున్నది. కంపాక్ట్ ఎస్యూవీ కార్ల సెగ్మెంట్లో కైలాక్‌ను కీలక ప్లేయర్ గా మార్చాలని స్కోడా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది.
కైలాక్ కారు ఇంటీరియర్‌గా 10 అంగుళాల టచ్ స్క్రీన్ విత్ సపోర్ట్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, రేర్‌లో ఏసీ వెంట్స్, సింగిల్ పేన్ సన్ రూఫ్, కీలెస్ ఎంట్రీ, వైర్ లెస్ ఫోన్ చార్జింగ్, 6-స్పీకర్ కాంటోన్ సిస్టమ్, అంబియెంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉంటాయి. కైలాక్ కారు అన్ని వేరియంట్లలో సమగ్ర సెఫ్టీ ఫీచర్లు జత చేశారు. సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, ప్యాసింజర్లందరికీ 3-పాయింట్ సీట్ బెల్టులు ఉంటాయి.
స్కోడా కైలాక్ కారు ఆలీవ్ గోల్డ్ కలర్ ఆప్షన్ లో వస్తోంది. బోల్డ్ గ్రిల్లె, స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్ లైట్స్, స్లీక్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఉంటాయి. స్కోడా కైలాక్ కారు 1.0 లీటర్ల 3-సిలిండర్, టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 115 హెచ్‌పీ విద్యుత్, 178 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లతో వస్తుంది. 10.5 సెకన్లలో 100 కి.మీ వేగంతో దూసుకెళ్లడం స్కోడా కైలాక్ స్పెషాలిటీ.