Skoda Kylaq | గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంతకుముందు కారు కొంటే లగ్జరీగా భావించే వారు. కానీ ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరూ కారు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. కార్ల తయారీ సంస్థలు సైతం కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా అనునిత్యం కొత్త ఫీచర్లతో సరికొత్త మోడల్ కార్లు తీసుకొస్తున్నాయి. కరోనా తర్వాత ఎస్యూవీ కార్లపైన ప్రతి ఒక్కరూ మనస్సు పారేసుకుంటున్నారు. ఈ క్రమంలో కార్ల తయారీ సంస్థలు ఎస్‌యూవీల తయారీలో పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి. ఈ పోటీలోకి జెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ స్కోడా వచ్చి చేరుతోంది. భారత్ మార్కెట్లో త్వరలో సబ్ కంపాక్ట్ ఎస్యూవీ కారును ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. వచ్చే ఏడాది ఆవిష్కరించనున్న సబ్ కంపాక్ట్ ఎస్యూవీ కారుకు కైలాక్ (Kylaq) అని నామకరణం చేసింది. ఇందుకోసం కస్టమర్ల నుంచి అభిప్రాయాలు సేకరించిన స్కోడా.. సంస్కృతం అనే అర్థం వచ్చేలా కైలాక్ అని పేరు పెట్టింది.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx), టాటా నెక్సాన్ (Tata Nexon), హ్యుండాయ్ వెన్యూ (Hyundai Venue), కియా సోనెట్ (Kia Sonet), మహీంద్రా ఎక్స్‌యూవీ 300 (Mahindra XUV 300) వంటి పాపులర్ మోడల్ కార్లకు స్కోడా కైలాక్(Skoda Kylaq) పోటీ ఇవ్వనున్నది. ఈ కారు ధర రూ.8 లక్షల నుంచి రూ.14 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుందని భావిస్తున్నారు.
కుషాక్ (Kushaq), స్లావియా (Slavia) సెడాన్ వంటి కార్లు తయారు చేసిన ఎంక్యూబీ -ఏఓ-ఐఎన్ ప్లాట్ ఫామ్ (MQB-AO-IN) మీదే తాజా స్కోడా కైలాక్ (Skoda Kylaq) తయారవుతుంది. స్ల్పిట్ హెడ్ ల్యాంప్ సెటప్, ఎల్ఈడీ డే టైం రన్నింగ్ లైట్స్ (డీఆర్ఎల్స్), రూఫ్ రెయిల్స్, రాప్ రౌండ్ టెయిల్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఉంటాయి. అయితే ఇంటీరియర్ ఫీచర్లు ఏమేం ఉంటాయన్న సంగతి వెల్లడించలేదు.
స్కోడా కైలాక్ (Skoda Kylaq) కారు 1.0 లీటర్ల టీఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో వస్తోంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 115 హెచ్‌పీ, 178 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో వస్తుందని భావిస్తున్నారు.