TCS – Infosys | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఆరు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,40,478.38 కోట్లు హరించుకుపోయింది. వాటిలో దేశీయ ఐటీ దిగ్గజాలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్ అత్యధికంగా నష్టపోయాయి. గతవారం బీఎస్ఈ బెంచ్మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ 1,156.57 పాయింట్లు (1.55 శాతం) నష్టపోయింది. శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు. టీసీఎస్, ఇన్ఫోసిస్లతోపాటు ఐసీఐసీఐ బ్యాంక్, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), ఐటీసీ, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టపోయాయి. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగింది.
బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లోని టాప్-10 సంస్థల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.62,538.64 కోట్లు కోల్పోయి రూ.13,84,804.91 కోట్లకు చేరుకున్నది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.30,488.12 కోట్లు కోల్పోయి రూ.5,85,936.45 కోట్ల వద్ద స్థిర పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి అంచనాలు మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోకపోవడంతో శుక్రవారం ఇన్ఫోసిస్ షేర్ సుమారు ఒకశాతం నష్టపోయింది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.26,423.74 కోట్లు కోల్పోయి రూ.7,49,023.89 కోట్లకు చేరుకున్నది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ.14,234.76 కోట్లు నష్టపోయి రూ.6,70,059.86 కోటల వద్ద స్థిర పడింది.
ఐటీసీ ఎం-క్యాప్ రూ.6,616.9 నష్టపోయి రూ.5,30,350.97 కోట్ల వద్ద ముగిసింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) ఎం-క్యాప్ రూ.176.22 కోట్ల పతనంతో రూ.5,24,487.51 కోట్ల వద్ద ముగిసింది.
మరోవైపు, భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.37,797.09 కోట్ల లబ్ధితో రూ.7,30,658.36 కోట్ల వద్ద నిలిచింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.9,420.17 కోట్లు లాభ పడి రూ.11,63,314.93 కోట్లకు చేరుకున్నది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,397.82 కోట్లు పెరిగి రూ.19,90,195.52 కోట్ల వద్ద స్థిర పడింది. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఎం-క్యాప్ రూ.1,201.75 వృద్ధి చెంది రూ.6,15,453.90 కోట్ల వద్ద నిలిచింది. గత వారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో రిలయన్స్ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, ఎల్ఐసీ, ఇన్ఫోసిస్, ఐటీసీ, హెచ్యూఎల్ నిలిచాయి.