న్యూఢిల్లీ, జనవరి 24: బడ్జెట్‌కు వేళైంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కొత్త పద్దును ప్రవేశపెట్టనున్నారు. అయితే కొన్నేండ్లుగా వ్యక్తిగత ఆదాయ పన్ను (ఐటీ) చెల్లింపుదారులకు బడ్జెట్ ఊరించి ఉసూరుమనిపిస్తూనే ఉన్నది. దీంతో ఈసారి పద్దులోనైనా మోదీ సర్కారు ఊరటనిస్తుందా? ముఖ్యంగా పాత పన్ను విధానం కింద సెక్షన్ 80లోని వివిధ క్లాజ్‌ల ద్వారా వర్తించే పన్ను మినహాయింపు పరిమితుల్ని పెంచుతారా? అన్నది మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.
సెక్షన్ 80
దేశ ప్రజల పొదుపు, పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఆదాయ పన్ను శాఖ.. సెక్షన్ 80లోని వివిధ క్లాజ్‌ల కింద పన్ను మినహాయింపుల్ని కల్పిస్తున్నది. వ్యక్తులు, హిందూ అవిభా జ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్) వీటిని అధికంగా క్లెయిం చేసుకోవచ్చు. వార్షిక ఆదాయానికి సంబంధించి ఐటీ రిటర్నులు దాఖలు చేసేటప్పుడు ఆయా సెక్షన్ల కింద పన్ను మినహాయింపుల్ని తీసుకోవచ్చు. వాటిని పరిశీలిస్తే..
80సీ
ట్యాక్స్‌పేయర్లు రకరకాల పన్ను మినహాయింపులను సెక్షన్ 80సీ కింద కోరవచ్చు. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాల (హెచ్‌యూఎఫ్)వారు అర్హులు. ఏటా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపును అందుకోవచ్చు. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీములు, పీపీఎఫ్/ఎస్పీఎఫ్/ఆర్పీఎఫ్, జీవిత బీమా ప్రీమియం చెల్లింపులు, గృహ రుణం అసలు, ఎస్ఎస్వై, ఎన్ఎస్సీ, ఎస్సీఎస్ఎస్ వంటి పథకాలకూ వర్తిస్తుంది. అలాగే 80సీసీసీ, 80సీసీడీ(1), 80సీసీఈ, 80సీసీడీ(1బీ), 80సీసీడీ(2) కింద కూడా క్లెయింలు చేసుకోవచ్చు.
80డీ
వ్యక్తిగత, భాగస్వామి-పిల్లల కోసం తీసుకునే ఆరోగ్య బీమా కోసం ఏటా 25,000 వరకు సెక్షన్ 80డీ కింద పన్ను మినహాయింపును కోరవచ్చు. ఒకవేళ ట్యాక్స్‌పేయర్ వయసు 60 ఏండ్లు దాటితే ఇది రూ.50,000గా ఉన్నది. ఇక తల్లిదండ్రుల కోసం తీసుకునే ఆరోగ్య బీమాకూ మరో రూ.25,000 వరకు పన్ను మినహాయింపును అందుకోవచ్చు. తల్లిదండ్రుల వయసు 60 ఏండ్లు దాటితే ఈ ప్రయోజనం రూ.50,000. మొత్తంగా ఆరోగ్య బీమాలకు చేసే చెల్లింపుల్లో గరిష్ఠంగా ఏటా లక్ష రూపాయలదాకా పన్ను మినహాయింపులు తీసుకోవచ్చు. అలాగే 80డీడీ కింద ట్యాక్స్‌పేయర్స్ తమపై ఆధారపడిన దివ్యాంగుల వైద్య చికిత్సకు చేసే చెల్లింపులకుగాను ఏటా రూ.1.25 లక్షలదాకా పన్ను మినహాయింపును అందుకోవచ్చు. ట్యాక్స్‌పేయర్స్ వ్యక్తిగతంగా తీసుకునే వైద్య చికిత్స ఖర్చులకూ సెక్షన్ 80డీడీబీ కింద లక్ష రూపాయల వరకు క్లెయిం చేసుకోవచ్చు.
80ఈ
దేశ, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి తీసుకున్న విద్యా రుణంపై చెల్లించే మొత్తం వడ్డీకి వ్యక్తిగత ఆదాయ పన్నులో సెక్షన్ 80ఈ కింద మినహాయింపు తీసుకోవచ్చు.
80ఈఈఏ
రుణంపై మొదటిసారి ఇల్లు కొన్నవారికి వర్తిస్తుంది. సెక్షన్ 80ఈఈఏ కింద గృహ రుణంపై చెల్లించే వార్షిక వడ్డీ మొత్తాల్లో రూ.1.5 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపును కోరవచ్చు. సెక్షన్ 24 కింద ప్రస్తుతమున్న రూ.2 లక్షల పన్ను మినహాయింపునకు ఇది అదనం. ఇక సెక్షన్ 80 ఈఈ కూడా ఉన్నది. అం దులో రూ.50,000 వరకే మినహాయింపును పొందేవారు. 2019 బడ్జెట్లో సెక్షన్ 80ఈఈఏను పరిచయం చేశారు.
80ఈఈబీ
విద్యుత్తు ఆధారిత వాహన (ఈవీ) కొనుగోలుదారులకు ఇది వర్తిస్తుంది. వాహన రుణంపై చెల్లించే వడ్డీలో సెక్షన్ 80ఈఈబీ కింద ఏటా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపును అందుకోవచ్చు.
80జీ
సామాజిక బాధ్యతతో చేసే విరాళాలపై పన్ను మినహాయింపును సెక్షన్ 80జీ ద్వారా అందుకోవచ్చు. విరాళాలనుబట్టి పూర్తిగా లేదా సగం మేరకు పన్ను మినహాయింపును తీసుకోవచ్చు. ఇక సెక్షన్ 80జీజీబీ కింద రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలపై కంపెనీలు పన్ను మినహాయింపుల్ని క్లెయిం చేసుకోవచ్చు. అలాగే సెక్షన్ 80జీజీసీ కింద రాజకీయ పార్టీలకు ఇచ్చిన విరాళాలపై వ్యక్తులు క్లెయిం చేసుకోవచ్చు.
80జీజీ
అద్దె ఇంట్లో నివసిస్తున్నా తమ జీతాల్లో హౌజ్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ)ను పొందలేకపోతున్న ఉద్యోగులు.. సెక్షన్ 80జీజీ కింద పన్ను మినహాయింపును క్లెయిం చేసుకోవచ్చు. నెలకు రూ.5,000 చొప్పున ఏడాదికిగాను తమ వార్షిక ఆదాయంలో గరిష్ఠంగా రూ.60,000 వరకు పన్ను మినహాయింపును ఫారం 10 బీఏ ద్వారా కోరవచ్చు.
80ఆర్ఆర్బీ
పేటెంట్ హక్కుల కింద రాయల్టీని పొందినప్పుడు సెక్షన్ 80ఆర్ఆర్బీ ద్వారా రూ.3 లక్షలదాకా పన్ను మినహాయింపుల్ని కోరవచ్చు. కాపీరైట్ లేదా రాయల్టీ ద్వారా పొందే ఆదాయంపై రచయితలు సెక్షన్ 80క్యూక్యూబీ కింద పన్ను మినహాయింపుల్ని కోరవచ్చు.
80టీటీఏ
పొదుపు ఖాతాలపై వడ్డీ విషయంలో వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు సెక్షన్ 80టీటీఏ కింద ఏటా గరిష్ఠంగా రూ.10,000 వరకు పన్ను మినహాయింపును కోరవచ్చు.
80టీటీబీ
60 ఏండ్లు, ఆపై వయసుగల సీనియర్ సిటిజన్లు తమ డిపాజిట్ల నుంచి పొందే వడ్డీ ఆదాయంపై సెక్షన్ 80టీటీబీ కింద ఏటా గరిష్ఠంగా రూ.50,000 వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు.
80యూ
భౌతిక, మానసిక సమస్యలతో బాధపడేవ్యక్తులకు సెక్షన్ 80యూ కింద తీవ్రతనుబట్టి రూ.75,000-1,25,000 వరకు పన్ను మినహాయింపును కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. అయితే వైద్యుల ధృవీకరణ తప్పనిసరి.
ఈ సెక్షన్లపైనే గురి..
ప్రధానంగా సెక్షన్ 80సీ, డీ, ఈఈఏ, ఈఈబీ, జీజీ, టీటీబీల కింద ఐటీ మినహాయింపు పరిమితుల్ని పెంచాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. పెరిగిన ఖర్చులు, ద్రవ్యోల్బణం దృష్ట్యా ఈసారి బడ్జెట్లో ఊరటనివ్వాలని వేతన జీవులు, వ్యక్తిగత ట్యాక్స్‌పేయర్లు, సీనియర్ సిటిజన్లు కోరుతున్నారు. దీనివల్ల పొదుపు పథకాల్లో పెట్టుబడులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, బీమా వంటివి అందరికీ ఆకర్షణీయంగా మారుతాయని నిపుణులు కూడా పేర్కొంటున్నారు. నిజానికి కరోనా దెబ్బకు కుప్పకూలిన దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. కానీ రూపాయి విలువ పతనం, తయారీ రంగం డీలా, ద్రవ్యోల్బణం విజృంభణ, అధిక వడ్డీరేట్ల కారణంగా ఆయా రంగాల్లో నిస్తేజం ఆవరించింది. దీంతో వినిమయ శక్తి పెరిగేలా ఆదాయ పన్ను రేట్లలో, శ్లాబుల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అయితే పాత, కొత్త పన్ను విధానాలను తీసుకొచ్చిన మోదీ సర్కారు.. కొత్త పన్ను విధానానికే మెరుగులు దిద్దుతున్నదికానీ.. పాత పన్ను విధానాన్ని పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. మరి ఈసారైనా ఈ విమర్శలు ఆగేలా నిర్ణయాలు ఉంటాయా? ఉండవా? అన్నది వేచిచూడాల్సిందే.