హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ) : ప్రముఖ ఫార్మా సంస్థ సిరో ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్..హైదరాబాద్‌కు సమీపంలోని సిద్దిపేట జిల్లాలో కరకపట్ల బయోటెక్ పార్క్ ఫేజ్-3లో దేశంలో తొలి ఇంటిగ్రేటెడ్ ఆంకాలజీ తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. రూ.800 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఆరోగ్య రంగంలో వేగంగా చోటు చేసుకుంటున్న మార్పులను అవకాశాలుగా అందిపుచ్చుకునేలా తెలంగాణను ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ ఆవిషరణల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని, పరిశోధన, సాంకేతికత, ఏఐ, అధునాతన తయారీ, నైపుణ్యాభివృద్ధిని సమన్వయం చేస్తూ భవిష్యత్తులో హెల్త్‌కేర్ రంగంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా సమగ్ర ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
జహీరాబాద్ నిమ్జ్‌ను మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. తాజాగా ప్రారంభించిన ఈ ప్లాంట్‌లో అత్యాధునిక క్యాన్సర్ నివారణకు సంబంధించిన ఓరల్ ఆంకాలజీ ఔషధాలు, స్టెరిలైజ్డ్ ఇంజెక్టబుల్స్, లైయోఫిలైజ్డ్ పౌడర్ ఇంజెక్షన్లు, సాఫ్ట్ జెల్ క్యాప్సూల్స్ ను ఉత్పత్తి చేయనున్నట్టు వెల్లడించారు. ఈ యూనిట్‌తో కొత్తగా 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.