హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): పర్యావరణహిత కార్యక్రమాలను చేపట్టడంలో ముందువరుసలో నిలిచే సింగరేణి మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. ప్రస్తుతం నిర్వహిస్తున్న హైడ్రోజన్ ప్లాంట్‌ను గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌గా మార్చడంతోపాటు, రామగుండం రీజియన్‌లో ఒక గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు అవకాశాలను పరిశీలించి నివేదికను సమర్పించాలని ఉన్నతాధికారులను సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ ఆదేశించారు. ఇప్పటికే 224 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను పర్యావరణహితంగానిర్వహిస్తున్న సంస్థ… హైడ్రోజన్‌ను కూడా ఉత్పత్తి చేయాలని ఆయన సూచించారు. ఇందులో భాగంగా 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రంలో వినియోగించేందుకు కావాల్సిన హైడ్రోజన్‌ను ఇకపై సౌర విద్యుత్తును వినియోగిస్తూ ఉత్పత్తి చేయాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రస్తుత ప్లాంట్‌లో తక్షణం చేయాలని ఆదేశించారు.
ప్రస్తుతం థర్మల్ విద్యుత్తు కేంద్రంలో 600 మెగావాట్ల సామర్థ్యంతో రెండు యూనిట్ల (1200 మెగావాట్లు) లోని జనరేటర్లలో వేడిమిని తగ్గించేందుకు శీతలీకరణ దాతువుగా హైడ్రోజన్‌ను వినియోగిస్తున్నారు. దీనికోసం ప్లాంట్ ఆవరణలోనే ఒక హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏడాదికి దాదాపు 10 వేల క్యూబిక్ మీటర్ల హైడ్రోజన్ వాయువును ఈప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తూ.. వినియోగిస్తునానరు. ప్రస్తుతం ఈ ప్లాంట్ 100 కిలోవాట్ల విద్యుత్తును వినియోగిస్తూ హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం ప్రాంగణంలోనే.. 10 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్, 5 మెగావాట్ల ఫ్లోటింగ్ సౌర విద్యుత్తు ప్లాంట్లు ఉన్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో సౌర విద్యుత్తు ప్లాంట్ల ద్వారా 170 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అయ్యింది. దీనితో సింగరేణికి రూ.108 కోట్ల ఆదా అయినట్టు కంపెనీ డైరెక్టర్ వివరించారు.