హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తేతెలంగాణ) : భవిష్యత్లో దేశవ్యాప్తంగా నిర్వహించే బొగ్గు గనులతో పాటు ఇతర ఖనిజాల వేలంపాటలో సింగరేణి పాల్గొననున్నదని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. కార్మిక సంఘాలు, సింగరేణి బోర్డు విజ్ఞప్తి మేరకు సంస్థ భవిష్యత్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. శుక్రవారం సింగరేణి సీఎండీ ఎం బలరాం, డైరెక్టర్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. వేలంపాటలో పాల్గొనడం ద్వారా సింగరేణికి కొత్త గనులు వస్తాయని, రాష్ట్రానికి రాయల్టీ రూపంలో రాబడి పెరుగుతుందని పేర్కొన్నారు.
గతంలో వేలంపాటకు దూరంగా ఉండటంతో సత్తుపల్లి, కోయగూడం గనులను కోల్పోయామని, దీంతో సంస్థకు రూ. 60 వేల కోట్లకుపైగా ఆదాయాన్ని, రూ.15 వేల కోట్లకుపైగా లాభాలను కోల్పోయిందని వివరించారు. ప్రస్తుతం 38 గనుల ద్వారా 72.01 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీస్తున్నామని, 2042 నాటికి ఈ ఉత్పత్తి సగానికి పడిపోయే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.