హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : త్వరలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న వందకు పైగా బొగ్గు గనుల వేలంపాటలో పాల్గొని లాభసాటిగావున్న 10 బొగ్గు బ్లాక్లను దక్కించుకుంటామని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం ధీమాను వ్యక్తంచేశారు. తద్వారా 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి సంస్థగా సింగరేణిని తీర్చిదిద్దుతామన్నారు. మంగళవారం సింగరేణి భవన్లో గుర్తింపు, ప్రాతినిథ్య కార్మిక సంఘాలతో నిర్వహించిన 38వ సంయుక్త సంప్రదింపులు కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
దేశంలోని 10 రాష్ర్టాలకు సింగరేణి కార్యకలాపాలు విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నట్టు, అలాగే అంతర్జాతీయంగా ఐదుదేశాలపై దృష్టి సారించినట్టు చెప్పారు. చిలీ, బ్రెజిల్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో క్రిటికల్ మైనింగ్ రంగంలో ప్రవేశించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఒడిశాలో 2,400 మెగావాట్ల థర్మల్ప్లాంట్ను నెలకొల్పబోతున్నామన్నారు.