ముంబై, డిసెంబర్ 20: డాటా కేంద్రంగా హైదరాబాద్ మారిపోతున్నది. ఇప్పటికే పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ డాటా కేంద్రాలను ఏర్పాటు చేయగా..తాజాగా సింగపూర్‌కు చెందిన ప్రిన్స్టన్ డిజిటల్ గ్రూపు(పీడీజీ) కూడా చేరింది. భవిష్యత్తులో హైదరాబాద్‌లో డాటా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని పీడీజీ మేనేజింగ్ డైరెక్టర్(ఇండియా) విపిన్ శిర్సత్ తెలిపారు. ఒక్కో డాటా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి 300 మిలియన్ డాలర్లు(రూ.2,400 కోట్ల) మేర నిధులను ఖర్చు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
48 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ డాటా కేంద్రం ఎప్పటిలోగా ఏర్పాటు చేసేదానిపై ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. భారత్‌లో డాటా సెంటర్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నట్లు, త్వరలో బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, పుణెల్లో కూడా సెంటర్లను కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. భారత మార్కెట్ మాకు చాలా కీలకమని, అందుకోసమే ఇక్కడి వ్యాపారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.
నవీ ముంబైలో 300 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన డాటా సెంటర్‌ను ఇటీవల సంస్థ ప్రారంభించింది. ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ కెపాసిటీ 48 మెగావాట్లు. ప్రస్తుతం 4 మెగావాట్ల సామర్థ్యంతో డాటా సెంటర్ పనిచేస్తుండగా..వచ్చే ఏడాది చివరి నాటికి 10 మెగావాట్లకు, 2024 చివరి నాటికి తన కెపాసిటీని 24 మెగావాట్లకు పెంచు కోనున్నది.