మ్యూచువల్ ఫండ్స్ మాదిరిగానే ఈ హెడ్జ్ ఫండ్స్ కూడా రకరకాల సాధనాల్లో పెట్టుబడులు పెడుతాయి. అయితే ఇవన్నీ ప్రైవేట్‌గానే నిర్వహించబడుతాయి. అంటే ఇవి రిజిస్టర్డ్ లేదా మార్కెట్ రెగ్యులేటర్ సెబీ పర్యవేక్షణలోనివి కావన్నమాట. అసలు ఈ హెడ్జ్ ఫండ్స్ లక్ష్యం.. ఎంతో రిస్క్ ఉన్నప్పటికీ సంప్రదాయేతర పెట్టుబడి వ్యూహాలతో మార్కెట్లో ఎలాంటి పరిస్థితులున్నా అధిక రాబడులను అందిపుచ్చుకోవడమే.
అందుకు షార్ట్ సెల్లింగ్, పరపతి, డెరివేటివ్‌ల వంటి సంక్లిష్ట వ్యూహాలను అవలంభిస్తాయి. ఇక ఈ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లు సాధారణంగా 2 శాతం మేనేజ్మెంట్ ఫీ, 20 శాతం పర్ఫార్మెన్స్ ఫీలను ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేస్తాయి.
పెట్టుబడి తీరు: ఇందులో అక్రిడేటెడ్ లేదా హై నెట్‌వర్త్ ఇండివీడ్యువల్స్ లేదా సంస్థాగత మదుపరులు మాత్రమే పాల్గొనవచ్చు. దీంతో కనీస పెట్టుబడి చాలా ఎక్కువ. ఇది రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టేదాని కంటే ఎంతో అధికం.
రిస్క్ పరంగా..: హై రిస్క్‌తో కూడిన డెరివేటివ్‌లు, పరపతి, ప్రత్యామ్నాయ సాధనాలను ఇన్వెస్ట్మెంట్స్ కోసం హెడ్జ్ ఫండ్స్ వాడుతాయి. ఇక మ్యూచువల్ ఫండ్స్ మాదిరిగా హెడ్జ్ ఫండ్స్ పారదర్శకం కావు. తమ నికర ఆస్తి విలువ (ఎన్ఏవీ)లను ప్రకటించవు. వీటిపై నియంత్రణ కూడా ఉండదు.
