Gold-Silver Rates | ఫెస్టివ్ సీజన్, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు భగభగ మండుతున్నాయి. అనునిత్యం కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.350 వృద్ధి చెంది ఫ్రెష్ ఆల్ టైం రికార్డు ధర రూ.81 వేల మార్క్‌కు చేరుకుంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1500 పెరిగి రూ.లక్ష మార్కును దాటేసింది. వరుసగా ఐదో రోజు కిలో వెండి ధర రూ.1,500 వృద్ధితో రూ.1.01 లక్షలకు చేరుకున్నది. సోమవారం కిలో వెండి ధర రూ.99,500 వద్ద స్థిర పడింది.
పరిస్థితులు ఇలాగే కొనసాగితే దీపావళి నాటికి కిలో వెండి ధర రూ.1.1 లక్షలు, తులం బంగారం ధర రూ.లక్షకు చేరుతుందని ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారు. 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం తులం సోమవారం 79,650 వద్ద నిలిచింది. ఇక మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో డిసెంబర్ డెలివరీ గోల్డ్ కాంట్రాక్ట్స్ తులం ధర రూ.78,247 పలికితే, డిసెంబర్ డెలివరీ కిలో వెండి ధర రూ.98,330 వద్ద నిలిచింది. అంతర్జాతీయంగా కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్‌లో ఔన్స్ బంగారం 2747.10 డాలర్లు, ఔన్స్ వెండి ధర 34.41 డాలర్లు పలికాయి.