Silver-Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం కిలో వెండి ధర రూ.4,900 క్షీణించి రూ.90,900లకు పడిపోయింది. తద్వారా మూడు వారాల కనిష్ట స్థాయికి చేరుకున్నది. బుధవారం ఒక్కరోజే కిలో వెండి ధర రూ.5,200 పుంజుకుని రూ.95,800 పలికింది. కిలో వెండి ధర అక్టోబర్ 21 తర్వాత 5,000 పెరగడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు ఈ నెల నాలుగో తేదీన కిలో వెండి ధర రూ.4,600 పతనమైంది.
దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.100 తగ్గి రూ.78,700 పలికింది. ఇక బుధవారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.650 పుంజుకుని రూ.78,800 వద్ద స్థిర పడింది. బుధవారానికి ముందు వరుసగా రెండు సెషన్లలో తులం బంగారం ధర రూ.2,250 క్షీణించింది. మంగళవారం తులం బంగారం ధర 78,150 పలికింది. గురువారం 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర 78,700 పలికింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో గోల్డ్ కాంట్రాక్ట్స్ డిసెంబర్ డెలివరీ తులం ధర రూ.167 తగ్గి రూ.75,927 లకు చేరుకున్నది. కిలో వెండి డిసెంబర్ డెలివరీ ధర రూ.115 పతనమై రూ.87,565 వద్ద స్థిర పడింది. అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ లో ఔన్స్ బంగారం ధర 8.20 డాలర్లు వృద్ధితో 2,673 డాలర్లకు చేరుకున్నది. ఇక ఔన్స్ వెండి ధర 0.15 శాతం తగ్గి, 30.51 డాలర్లకు చేరుకున్నది.