న్యూఢిల్లీ, డిసెంబర్ 10: వెండి వెలుగులు విరజిమ్ముతున్నది. బుధవారం రాకెట్ వేగంతో దూసుకుపోయి మరో చారిత్రక గరిష్ఠ స్థాయికి ఎగబాకింది. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి ఏకంగా రూ.1.92 లక్షలు పలికింది. నిన్నటి ముగింపుతో పోలిస్తే ఒకేరోజు కిలో ధర రూ.11,500 ఎగబాకినట్టు అయింది. వెండి చరిత్రలో ఒకేరోజు ఇంతటి స్థాయిలో ఎగబాకడం ఇదే తొలిసారి కావడం విశేషం. దేశీయంగా డిమాండ్ నెలకొనడంతోపాటు గ్లోబల్ మార్కెట్లో కూడా అమ్మకాలు దూసుకుపోవడం ధరలు పెరుగడానికి ప్రధాన కారణమని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది.
మంగళవారం కిలో ధర రూ.1,80,500గా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇప్పటి వరకు కిలో వెండి ఏకంగా రూ.1,02,300 లేదా 114 శాతం ఎగబాకింది. డిసెంబర్ 31, 2024న కిలో ధర రూ.89,700గా ఉన్నది. ఈ ఏడాది అక్టోబర్ 10న రికార్డుస్థాయి ఒకేరోజు రూ.8,500 పెరిగింది. మరోవైపు, వెండితోపాటు బంగారం మరింత పెరిగింది.
99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.800 ఎగబాకి రూ.1,32,400 పలికింది. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటం ధరలు పెరుగడానికి కలిసొచ్చిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4,201.70 డాలర్లు పలుకవగా, వెండి 1.53 శాతం ఎగబాకి రికార్డు స్థాయి 61.60 డాలర్లకు చేరుకున్నది. గడిచిన రెండు సెషన్లలో వెండి ఆరు శాతం పుంజుకున్నది.