Silver- Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్లో వెండి ధర పతనమవుతోంది. గురువారం దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,100 తగ్గి రూ.81,100లకు పడిపోయింది. బుధవారం కిలో వెండి ధర రూ.82,200 పలికింది. మరోవైపు తులం బంగారం ధర రూ.71,350 వద్ద యధాతథంగా కొనసాగుతున్నది. 99.9 స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.71,350, 99.5 స్వచ్ఛత గల బంగారం (పది గ్రాములు) ధర రూ.71 వేలు పలికింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర మూడు డాలర్లు పుంజుకుని 2,396 డాలర్లకు చేరుకున్నది. కామెక్స్ గోల్డ్ లో కొన్ని రోజులుగా బంగారం ధర నికరంగా పెరుగుతున్నది. డాలర్ ఇండెక్స్ బలహీనతలతో ఇన్వెస్టర్లు తమకు సురక్షిత పెట్టుబడి మార్గంగా బంగారంపైనే ఆశలు పెంచుకుంటున్నారని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ తెలిపారు.
భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో బంగారం ధర పెరుగుతున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. యూఎస్ ఫెడ్ రిజర్వ్ కమిటీ సభ్యుల నిర్ణయంపైనే ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. ఇందుకోసం యూఎస్ ద్రవ్యోల్బణం, వ్యవసాయేతర ఉద్యోగాల జాబితాపై అందరి దృష్టి ఉంది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 26.89 డాలర్ల వద్ద ఫ్లాట్గా కొనసాగుతున్నది.