న్యూఢిల్లీ, అక్టోబర్ 4: షెల్ ఇండియా తమ బంకుల్లో విక్రయించే డీజిల్ ధరను భారీగా పెంచేసింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే లీటర్ డీజిల్ రేటు ఏకంగా రూ.20 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర దాదాపు 90 డాలర్లు పలుకుతున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లో లీటర్ డీజిల్ ధరను రోజుకు రూ.4 చొప్పున షెల్ ఇండియా పెంచుతూపోతున్నది. ఈ మేరకు కంపెనీ డీలర్లు, ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఈ క్రమంలోనే షెల్ ఇంధన బంకుల్లో లీటర్ డీజిల్ ధర గరిష్ఠంగా రూ.134కి చేరింది. లీటర్ పెట్రోల్ సైతం రూ.117-118కి అమ్ముతున్నారు.
అయితే భారత్లో షెల్ కంపెనీకి ఆయిల్ రిఫైనరీలు లేకపోవడమే ఈ స్థాయిలో ధరల పెరుగుదలకు కారణంగా తెలుస్తున్నది. కాగా, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చమురు, గ్యాస్ కంపెనీగా ఉన్న షెల్ ఇండియాకు దేశవ్యాప్తంగా 346 పెట్రోల్ బంకులున్నాయి. ఇదిలావుంటే ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్పీసీఎల్) బంకుల్లో ఇంధన ధరలు యథాతథమే. హైదరాబాద్లో లీటర్ డీజిల్ ధర రూ.97.82గా, పెట్రోల్ ధర రూ.109.66గానే ఉన్నాయి. గత ఏడాదిన్నరగా ధరలు ఇలాగే ఉంటుండగా, ఆయా రాష్ర్టాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యానే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ధరలు స్థిరంగా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల తర్వాత భారీ వడ్డనలు తప్పవన్న అంచనాలూ బలంగా ఉండటం గమనార్హం. ఇక దేశంలో మొత్తం 87,677 పెట్రోల్ పంపులుండగా, ఇందులో ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్కు చెందినవే 79,204. మిగతా వాటిలో నయారా ఎనర్జీకి 6,422, రిలయన్స్-బీపీకి 1,633 ఉన్నాయి.