న్యూఢిల్లీ : టెక్ దిగ్గజాలను ఆర్ధిక మాంద్య భయాలు వెంటాడుతున్నాయి. గత ఏడాది నుంచి ఈ రంగాన్ని మాస్ లేఆఫ్స్ వణికించగా కొత్త ఏడాదిలోనూ ఇదే తీరు కొనసాగేలా ఉంది. ఏడాది ఆరంభంలోనే ప్రపంచవ్యాప్తంగా 18,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు అమెజాన్ సీఈఓ ఆండీ జస్సీ బాంబు పేల్చగా భారత్‌లోనూ పలువురు అమెజాన్ ఉద్యోగులపై వేటు పడింది.
అమెజాన్ బాటలో పలు టెక్ కంపెనీలు ఎడాపెడా లేఆఫ్స్‌ను ప్రకటించగా తాజాగా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం షేర్‌చాట్ 20 శాతం మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. లేఆఫ్స్‌ను ధ్రువీకరించిన షేర్‌చాట్ వ్యయాలు పెరిగిపోవడం, మూలధనం లభ్యత కొరవడటంతో కఠిన నిర్ణయం తీసుకోకతప్పలేదని కంపెనీ ప్రకటించింది. షేర్చాట్తో పాటు తన షార్ట్ వీడియో యాప్ మోజ్లోనూ తాజా లేఆఫ్స్‌లో భాగంగా 500 మందిని తొలగించనున్నట్టు సమాచారం.
సంక్లిష్ట పరిస్ధితులు ఎదురైన క్రమంలో ఉద్యోగుల తొలగింపుపై ఆచితూచి నిర్ణయం తీసుకున్నామని షేర్‌చాట్ ప్రతినిధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రకటనల రాబడి తగ్గడంతో పాటు లైవ్ స్ట్రీమింగ్ రెవెన్యూలూ పడిపోవడంతో రాబోయే రెండేండ్లు ప్రతికూల పరిస్ధితులను ఎదురీదాల్సిఉందని, ఉద్యోగుల వ్యయాల్లో కోత వేయడం ద్వారా కంపెనీ ఈ ఇబ్బందులను అధిగమిస్తుందని భావిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.