RBI | ముంబై, ఆగస్టు 21: అనిశ్చిత అంతర్జాతీయ ఆర్థిక వాతావరణంలో కరెన్సీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న ప్రస్తుత తరుణంలో బంగారం నిల్వల్ని రిజర్వ్‌బ్యాంక్ పెంచుకుంటున్నది. ఆర్బీఐ వద్దనున్న మొత్తం ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) నిల్వల్లో పుత్తడి వాటా గత మూడేండ్లలో 6.08 శాతం నుంచి 7.36 శాతానికి చేరింది. కొవిడ్ తర్వాత విదేశీ మారక నిల్వల్లో పుత్తడి వాటా 1 శాతంపైగా పెరిగినట్టు ఆర్బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ద్రవ్యోల్బణం పెరగడం, అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంక్‌లు బంగారాన్ని కొంటున్నాయని, ఈ ట్రెండ్‌లో భాగంగానే ఆర్బీఐ సైతం తన ఫారెక్స్ రిజర్వుల్లో కొన్నింటిని పుత్తడి నిల్వల కోసం వెచ్చిస్తున్నట్టు విశ్లేషకులు తెలిపారు. 2020 జనవరి 3న ఆర్బీఐ వద్ద రూ. 2.02 లక్షల కోట్ల విలువైన బంగారం ఉండగా, అది 2023 ఆగస్టు 18నాటికి రూ.3.67 లక్షల కోట్లకు చేరింది.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ద్రవ్యోల్బణం శరవేగంగా పెరగడంతో రక్షణగా గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్‌లు బంగారాన్ని కొంటున్నాయని షిన్హాన్ బ్యాంక్ ఫారెక్స్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ సోధని తెలిపారు. గత ఏడాది నుంచి పలు కేంద్ర బ్యాంక్‌లు వాటి బంగారం నిల్వలు పెంచుకుంటున్నాయని, దీనిని అనిశ్చితి పరిస్థితుల్లో సురక్షిత సాధనంగా భావించడం, బంగారం ధర పెరుగుదలతో ఆకర్షణీయమైన పెట్టుబడిగా మారడం ఇందుకు కారణమని వివరించారు. పసిడి కొనుగోళ్లకు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెద్ద కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, యూఎస్, యూరప్ దేశాలు విధించిన ఆంక్షలతో గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్‌లు పసిడి రిజర్వుల్ని పెంచుకుంటున్నాయన్నారు.
ఈ ఏడాది జనవరి-జూన్ మధ్యకాలంలో వివిధ దేశాల కేంద్ర బ్యాంక్‌లు 387 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మాత్రం నికర కొనుగోళ్లు 103 టన్నులకు తగ్గినట్టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక వెల్లడించింది. 2023 క్యూ1లో రిజర్వ్‌బ్యాంక్ 7 టన్నుల బంగారాన్ని తన నిల్వల్లో జతచేసింది. దీంతో బంగారం రిజర్వులు 795 టన్నులకు చేరాయి. మొత్తం విదేశీ మారక నిల్వలు రూ.49.9 లక్షల కోట్ల వద్ద నిలిచాయి.