
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు నూతన సంవత్సరం రెండో రోజు కూడా ట్రేడింగ్‌లో బుల్ మీద పరుగులు తీశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ 672 పాయింట్ల లబ్ధితో 59,855 పాయింట్ల వద్ద ముగిసింది. వరుసగా రెండు రోజుల్లో సెన్సెక్స్ 1600 పాయింట్లకు పైగా లాభ పడింది. సోమవారం 929 పాయింట్లు లబ్ధి పొందింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 179 పాయింట్ల గెయిన్‌తో 17,805 పాయింట్ల వద్ద స్థిర పడింది. మంగళవారం బీఎస్ఈ-30 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.271.37 లక్షల కోట్ల వద్ద నిలిచింది. సోమవారం రూ.269.95 లక్షల కోట్లకు చేరిన సంగతి తెలిసిందే.
ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 17,681 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో గరిష్టంగా 17,826 పాయింట్లకు దూసుకెళ్లి, కనిష్టంగా 17,593 పాయింట్లకు పతనమైంది. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ మంగళవారం కూడా 160 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ప్రారంభించింది. అంతర్గత ట్రేడింగ్‌లో గరిష్టంగా 59,937 పాయింట్లకు దూసుకెళ్లి.. కనిష్టంగా 59,084 పాయింట్లకు పడిపోయింది. బీఎస్ఈ-30 ఇండెక్స్‌లో కేవలం ఆరు స్టాక్స్ మాత్రమే నష్టాలతో ముగిశాయి.
బీఎస్ఈలో పవర్ గ్రిడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, టైటాన్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, నెస్ట్లే లబ్ధి పొందాయి. ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఆల్ట్రా టెక్ సిమెంట్ సంస్థల స్క్రిప్ట్‌లు నష్టపోయాయి. 576 స్టాక్స్ అప్పర్ సర్క్యూట్లో సాగితే, 226 స్క్రిప్ట్‌లు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
నిఫ్టీ-50 సూచీలో 35 షేర్లు లబ్ధి పొందగా, 15 పతనం అయ్యాయి. బ్యాంకింగ్, ఫైనాన్సియల్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్‌లు లాభ పడ్డాయి. ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు భారీగా లాభ పడ్డాయి. టాటా మోటార్స్, కోల్ ఇండియా, విప్రో, ఆల్ట్రాటెక్ సిమెంట్ పడిపోయాయి.