హైదరాబాద్ సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆరోసారి ఏసీఐ అవార్డు(ఆసియా పసిఫిక్ గ్రీన్ ఎయిర్‌పోర్ట్స్ గోల్డ్ రికగ్నైషన్)ను గెలుచుకుంది. ‘సింగిల్- యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన’కు కృషి చేసినందుకుగాను ఈ అవార్డు వరించింది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(జీహెచ్ఐఏఎల్) సింగిల్- యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనలో భాగంగా అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. ఫలితంగా ఎయిర్‌పోర్టులోని ఎఫ్అండ్బీ కన్సెషనైర్లు క్రమంగా స్టార్చ్‌తో చేసిన ప్లేట్లు, చెక్క స్పూన్లు, ఫోర్కులను ఉపయోగించడం ప్రారంభించినట్లు జీఎమ్మార్ అధికారులు తెలిపారు.
అలాగే వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా జ్యూట్ బ్యాగుల వంటి పర్యావరణ ఉత్పత్తుల వినియోగాన్ని కూడా ప్రోత్సహించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జీఎమ్మార్ గ్రూప్ సీఐవో ఎస్జీకే కిషోర్ మాట్లాడుతూ.. పర్యావరణాన్ని పరిరక్షించడానికి చేపట్టిన ప్రతి కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చినట్లు తెలిపారు. విమానాశ్రయం పరిధిలో బయో డీజిల్ వినియోగం, ఎలక్ట్రిక్ వాహనాలు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల వంటి హరిత పర్యావరణ ప్రయోజన కార్యక్రమాలను చేపట్టినట్లు వివరించారు. పర్యావరణ పరిరక్షణకు శంషాబాద్ విమానాశ్రయం చేస్తున్న కృషిని ఏసిఐ ఆధ్వర్యంలో గ్రీన్ ఎయిర్‌పోర్టు కమిటీ గుర్తించడం హర్షణీయమన్నారు.