ముంబై, మే 20: ప్రముఖ ఆభరణాల విక్రయదారు కల్యాణ్ జువెల్లర్స్ లైఫ్‌ైస్టెల్ జువెల్లరీ బ్రాండ్ క్యాండియర్ ప్రచారకర్తగా బాలీవుడ్ బాద్షా, అగ్రనటుడు షారుఖ్ ఖాన్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, జాతీయ స్థాయిలో విస్తరించే దిశగా వడివడిగా అడుగులేస్తున్న కల్యాణ్ జువెల్లర్స్.. వ్యూహాత్మకంగానే షారూఖ్‌ను ఎంపిక చేసుకున్నది. ఈ సందర్భంగా క్యాండియర్ డైరెక్టర్ రమేశ్ కల్యాణరామన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కొనుగోలుదారులు తమ జీవనశైలి, సమాజంలో హోదాను ప్రతిబింబించేలా నగలను కోరుకుంటున్నారని చెప్పారు.
తమ జీవితంలోని ప్రత్యేక సందర్భాల్లో మరింత ప్రత్యేకంగా కనిపించేందుకు మిక్కిలి ఆసక్తి కనబరుస్తున్నట్టు పేర్కొన్నారు. అందుకే వారి అభిరుచికి తగ్గట్టుగా కొత్తకొత్త డిజైన్లలో ఆభరణాలను అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు. ఈ క్రమంలో తమతో షారూఖ్ ఖాన్ భాగస్వామి కావడంపట్ల ఆనందంగా ఉందన్నారు. షారూఖ్ ఖాన్ మాట్లాడుతూ.. ప్రేమను వ్యక్తపర్చడానికి, జ్ఞాపకాలు, ప్రత్యేకతను చాటడానికి నగలు ఎల్లప్పుడూ ముందుంటాయన్నారు.