Market Capitalisation | గతవారం ట్రేడింగ్‌లో బీఎస్ఈలోని టాప్-10 సంస్థల్లో ఏడు సంస్థలు రూ.2.16 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి. వాటిల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) భారీగా నష్టపోయాయి. గతవారం ట్రేడింగ్‌లో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 1290.87 (2.12 %) పాయింట్ల నష్టంతో ముగిసాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, భారతీయ ఎయిర్టెల్ భారీగా నష్టపోయాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్), ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ పుంజుకున్నది. అదానీ గ్రూప్ ఇండస్ట్రీస్ షేర్ల విలువ, అప్పులపై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదిక బహిర్గతం కావడంతో గత రెండు సెషన్లలో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి.
గతవారం ట్రేడింగ్‌లో భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.46,318.73 కోట్లు నష్టపోయి రూ. 4,82,107.53 కోట్ల వద్ద నిలిచింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.36,836.03 కోట్ల పతనంతో రూ.5,70,509.34 కోట్లకు పడిపోయింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.24,899.93 కోట్ల నష్టంతో రూ.9,01,287.61 కోట్ల వద్ద స్థిర పడింది. భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ రూ.23,747.55 కోట్లు కోల్పోయి, రూ.4,31,583.22 కోట్ల వద్ద ముగిసింది.
హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,257.28 కోట్లు హరించుకుపోయి రూ.4,85,809.79 కోట్లతో సరిపెట్టుకున్నది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.3,029.82 కోట్ల నష్టంతో రూ.6,38,891.87 కోట్లకు చేరుకున్నది.
మరోవైపు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.17,837.88 కోట్లు పెరిగి రూ. 12,47,882.88 కోట్లకు పెరిగింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) ఎం-క్యాప్ రూ.14,931.65 కోట్ల లబ్ధితో రూ.6,13,689.74 కోట్ల వద్ద నిలిచింది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.13,591.48 కోట్ల వృద్ధితో రూ.4,29,031.46 కోట్లకు చేరింది.
గతవారం మార్కెట్ ముగిసిన తర్వాత అత్యంత విలువైన కంపెనీగా రిలయన్స్ నిలిచింది. తర్వాతీ స్థానంలో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనీ లివర్, ఎస్బీఐ, ఎయిర్టెల్, ఐటీసీ నిలిచాయి.