మూడు రోజుల విరామానంతరం స్టాక్ మార్కెట్లో తిరిగి గురువారం రికార్డులు హోరెత్తిపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ గత నాలుగు నెలల్లో ఎన్నడూ లేనంత అధికంగా 958 పాయింట్లు ర్యాలీ జరిపి 59,885 పాయింట్ల రికార్డుస్థాయి వద్ద ముగిసింది. ఈ సూచి ఇంట్రాడేలో 59,957 పాయింట్ల వరకూ పెరిగి, 60,000 పాయింట్ల శిఖరానికి కేవలం 43 పాయింట్ల దూరంలో నిలిచింది. ఇదే బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 276 పాయింట్లు జంప్‌చేసి 17,823 పాయింట్ల చరిత్రాత్మక గరిష్ఠస్థాయి వద్ద ముగిసింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: మూడు రోజుల విరామానంతరం స్టాక్ మార్కెట్లో తిరిగి గురువారం రికార్డులు హోరెత్తిపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ గత నాలుగు నెలల్లో ఎన్నడూ లేనంత అధికంగా 958 పాయింట్లు ర్యాలీ జరిపి 59,885 పాయింట్ల కొత్త రికార్డుస్థాయి వద్ద ముగిసింది. ఈ సూచి ఇంట్రాడేలోవెయ్యి పాయింట్ల వరకు ర్యాలీ జరిపి 59,957 పాయింట్ల వరకూ పెరిగింది. 60,000 పాయింట్ల శిఖరానికి కేవలం 43 పాయింట్ల దూరంలో నిలిచింది. ఇదే బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 276 పాయింట్లు జంప్‌చేసి 17,823 పాయింట్ల చరిత్రాత్మక గరిష్ఠస్థాయి వద్ద ముగిసింది. ప్రపంచంలో ప్రస్తుతం ఆల్‌టైమ్ రికార్డుస్థాయిలో ట్రేడవుతున్నవి భారత్ సూచీలే కావడం గమనార్హం.
3 లక్షల కోట్లు పెరిగిన సంపద
గురువారంనాటి ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద ఒక్కసారిగా రూ.3.14 లక్షల కోట్ల మేర పెరిగింది. బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ
రూ.261.71 లక్షల కోట్ల రికార్డుస్థాయికి ఎగిసింది.
ర్యాలీకి కారణాలు
ప్రపంచ మార్కెట్ల పాజిటివ్ ట్రెండ్: ద్రవ్య విధానాన్ని నవంబర్ నుంచి కఠినతరం చేయనున్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటించినా ప్రపంచ మార్కెట్లు గురువారం పెరిగాయి. ఆసియాలోని జపాన్‌కు సెలవుకాగా, హాంకాంగ్, చైనాలు పాజిటివ్‌గా ట్రేడయ్యాయి. యూరప్ సూచీలు 1 శాతం వరకూ పెరిగాయి. క్రితం రోజు 1 శాతంపైగా పెరిగిన అమెరికా సూచీల ఫ్యూచర్లు తిరిగి పాజిటివ్ ట్రెండ్‌ను ప్రదర్శించాయి.
విదేశీ పెట్టుబడుల ప్రవాహం: సెప్టెంబర్ నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారత్ మార్కెట్ల పట్ల బుల్లిష్ ధోరణిని కనపర్చారు. సెప్టెంబర్ 22 వరకూ ఎఫ్‌పీఐలు రూ.6,337 కోట్ల మేర ఇక్కడి ఈక్విటీ మార్కెట్లో నికరంగా పెట్టుబడి చేశారు.
బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ షేర్ల మద్దతు: తాజా మార్కెట్ ర్యాలీకి బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు నేతృత్వం వహించాయి. బీఎస్ఈ బ్యాంకెక్స్ 956 పాయింట్లు పెరగ్గా, బ్యాంక్ నిఫ్టీ 827 పాయింట్లు లాభపడింది.
ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆశాభావం: కొవిడ్ సంక్షోభంలో చిక్కుకున్న భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటుందన్న అంచనాలు ఈక్విటీ మార్కెట్లో జోష్‌ను నింపాయి. భారత్ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 10 శాతం వృద్ధి సాధిస్తుందన్న అంచనాల్ని ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ప్రకటించింది. రిజర్వుబ్యాంక్ ఇటీవల వెల్లడించిన 9.5 శాతం వృద్ధి అంచనాకంటే ఏడీబీ అంచనాలు అధికంగా ఉన్నాయి.
పటిష్ఠ సాంకేతికాలు: స్టాక్ సూచీల సాంకేతికాలు పటిష్ఠంగా ఉన్నాయని అనలిస్టులు చెపుతున్నారు. స్వల్పకాలంలో నిఫ్టీ 18,000 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చని హెమ్ సెక్యూరిటీస్ పీఎంఎస్ హెడ్ మొహిత్ నిగమ్ తెలిపారు.
రిలయన్స్ @ రూ. 16 లక్షల కోట్లు
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ గురువారం ఇంట్రాడేలో రూ.16 లక్షల కోట్ల మార్క్‌ను దాటింది. ఈ షేరు రూ.2,497 కొత్త రికార్డుస్థాయికి చేరినపుడు కంపెనీ మార్కెట్ విలువ రూ.16,88,455 కోట్లుగా నమోదయ్యింది. ఈ షేరు చివరకు 2.4 శాతం లాభంతో 2,488 వద్ద ముగిసింది. ఈ సెప్టెంబర్ 3న రిలయన్స్ విలువ తొలిసారిగా రూ.15 లక్షల కోట్ల స్థాయిని దాటింది.
‘అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ విధాన సమీక్షలో ఉద్దీపనను క్రమేపీ వెనక్కు తీసుకోవాలని నిర్ణయించినప్పటికీ, గ్లోబల్ మార్కెట్లు పెరగడం ఇక్కడి ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఈ ఏడాది నవంబర్ నుంచి బాండ్ల కొనుగోళ్లను తగ్గించడం ద్వారా వ్యవస్థలో నిధుల ప్రవాహాన్ని అదుపుచేయాలని ఫెడ్ నిర్ణయించింది’
-వినోద్ నాయర్, రీసెర్చ్ హెడ్, జియోజిత్ ఫైనాన్షియల్
‘దేశంలో కొవిడ్ కేసులు క్రమేపీ తగ్గడం, వ్యాక్సినేషన్లు వేగవంతంకావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో కార్పొరేట్ల లాభాలపై అంచనాలు పెరిగాయి’
-దేవాంగ్ మెహతా, ఈక్విటీ హెడ్, సెంట్రమ్ బ్రోకింగ్