1,736 పాయింట్లు అధికమైన సూచీ
ముంబై, ఫిబ్రవరి 15: దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు సద్దుమణిగే అవకాశాలు ఉండటం సూచీలను లాభాలవైపు నడిపించాయి. ఇంధన, ఆర్థిక, ఐటీ రంగ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 1,736.21 పాయింట్లు లేదా 3.08 శాతం లాభపడి మళ్లీ 58 వేల పాయింట్ల పైకి చేరుకున్నది. చివరకు 58,142.05 వద్ద ముగిసింది. ఫిబ్రవరి 1, 2021 తర్వాత ఒకేరోజు గరిష్ఠ స్థాయిలో లాభపడటం ఇదే తొలిసారి. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 509.65 పాయింట్లు అధికమై(3.03 శాతం) 17,352.45 వద్ద ముగిసింది.
30 షేర్ల ఇండెక్స్ సూచీలో అన్ని షేర్లు లాభాల్లో ముగిశాయి.
బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్సర్వ్, ఎల్అండ్టీ, టైటాన్, విప్రో, ఏషియన్ పెయింట్స్ షేర్లు ఐదు శాతం వరకు బలపడ్డాయి.
ద్రవ్యోల్బణం ఏడు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్నప్పటికీ మదుపరులు కొనుగోళ్ళకు మొగ్గుచూపారు.
రంగాలవారీగా చూస్తే వాహన, బ్యాంకింగ్, టెక్, రియల్టీ, ఐటీ రంగ షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి.
బీఎస్ఈ లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు మూడు శాతం వరకు అధికమయ్యాయి.
టోక్యో, హాంకాంగ్, సియోల్ దేశాల మార్కెట్లు పతనమవగా, షాంఘై, యూరప్ దేశాలకు చెందిన సూచీలు లాభాల్లో ముగిశాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ఫ్యూచర్ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 2.44 శాతం తగ్గి 94.13 డాలర్ల వద్దకి జారుకున్నది.
గత నాలుగు రోజులుగా పడిపోతున్న రూపాయి బలపడింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ 28 పైసలు ఎగబాకి 75.32 వద్ద ముగిసింది.