ముంబై, మార్చి 10: స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో కళకళలాడుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు క్రమంగా సద్దుమణిగే అవకాశాలుండటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు భారీగా లాభపడ్డాయి. ప్రారంభం నుంచే లాభాలబాటపట్టిన సూచీలకు ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలు మరింత జోష్‌నిచ్చాయి. ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో ఇంట్రాడేలో 1,500 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరికి 55,464.39 పాయింట్ల వద్ద ముగిసింది. నిన్నటితో పోలిస్తే 817.06 పాయింట్లు లేదా 1.50 శాతం లాభపడినట్లు అయింది. 249.55 పాయింట్లు అందుకొని ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 16,594.90 వద్ద స్థిరపడింది. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న చర్చలు కొలిక్కివచ్చే అవకాశాలు ఉండటం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడటం సూచీలకు కలిసొచ్చిందని ట్రేడర్ వెల్లడించారు.
11 లక్షల కోట్లు పెరిగిన సంపద
వరుస లాభాలతో మదుపరులు సంపద అమాంతం పెరుగుతున్నది. గత మూడు సెషన్లలో మదుపరుల సంపద రూ.10.83 లక్షల కోట్ల మేర పెరిగింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ విలువ రూ.10,83,103.27 కోట్లు పెరిగి రూ.2,51,93,934.31 కోట్లకు చేరుకున్నది. గత మూడు సెషన్లలో సెన్సెక్స్ 2,621.64 పాయింట్ల మేర లాభపడింది.
హిందుస్థాన్ యునిలీవర్ అత్యధికంగా 5 శాతానికి పైగా పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది.
టాటా స్టీల్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్‌ఫిన్, నెస్లె, మారుతి, ఎల్అండ్టీల రెండు శాతానికి పైగా అధికమయ్యాయి.
రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, ఐటీసీ, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, కొటక్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్, మహీంద్రా, విప్రో షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించింది.
కానీ, టెక్ మహీంద్రా, రెడ్డీస్, టీసీఎస్‌లు మాత్రం నష్టపోయాయి.
బీఎస్ఈ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్‌ల ఇండెక్స్‌లు ఒక్క శాతం వరకు అధికమయ్యాయి
రంగాలవారీగా చూస్తే ఎఫ్ఎంసీజీ, రియాల్టీ, మెటల్, బ్యాంక్ రంగాల సూచీ మూడు శాతం అధికమైంది.
2,433 స్టాక్స్ అధికమవగా, 929 పతనం చెందాయి.
l డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 19 పైసలు పెరిగి 76.43 వద్ద నిలిచింది.