ముంబై, సెప్టెంబర్ 28: దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. బుధవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 509.24 పాయింట్లు లేదా 0.89 శాతం కోల్పోయి 57వేల స్థాయికి దిగువన 56,598.28 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 621.85 పాయింట్లు పడిపోవడం గమనార్హం. మెటల్, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 148.8 పాయింట్లు లేదా 0.87 శాతం దిగజారి 16,858.6 వద్ద నిలిచింది. దీంతో ఆరోరోజూ ఈక్విటీ మార్కెట్లు నష్టాలకే పరిమితమైనైట్టెంది. ఇక ఈ ఆరు రోజుల్లో మదుపరుల సంపద రూ.17 లక్షల కోట్లదాకా ఆవిరైపోయింది. కాగా, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం, తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బ తీశాయని నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు.