ముంబై, నవంబర్ 19: దేశీయ స్టాక్ మార్కెట్లు మరోమారు ఆల్టైమ్ హై రికార్డు స్థాయిలకు చేరువయ్యాయి. బుధవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ మళ్లీ 85వేల మార్కును దాటింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కూడా 26వేల మార్కును అధిగమించింది. ఐటీ, బ్యాంకింగ్ షేర్లు మదుపరులను ఆకట్టుకోవడంతో సెన్సెక్స్ 513.45 పాయింట్లు లేదా 0.61 శాతం పుంజుకొని 85,186.47 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 85,236.77 పాయింట్లదాకా వెళ్లింది. ఇక నిఫ్టీ 142.60 పాయింట్లు లేదా 0.55 శాతం పెరిగి 26,052.65 దగ్గర ముగిసింది. ఇంట్రా-డేలో 26,074.65ను తాకింది. భారత్-అమెరికా ట్రేడ్ డీల్ కుదురుతుందన్న అంచనాల మధ్య దేశీయ సంస్థాగత మదుపరులు కొనుగోళ్లకు పెద్దపీట వేశారు. గత ఏడాది సెప్టెంబర్ 26న సెన్సెక్స్ తొలిసారి 85,836.12 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ 26,216.05 పాయింట్ల దగ్గర నిలిచింది. ఇప్పటిదాకా ఇవే సూచీలు ఆల్టైమ్ హై రికార్డులు. ఇప్పుడు ఈ స్థాయిలకు అటు సెన్సెక్స్, ఇటు నిఫ్టీలు దగ్గరగా వచ్చాయి. ఈ ఉత్సాహం ఇలాగే కొనసాగితే ఈ వారం సరికొత్త ఆల్టైమ్ హై రికార్డులు నమోదు కావడం ఖాయమేనంటున్నారంతా.
సెన్సెక్స్ షేర్లలో..
హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, హిందుస్థాన్ యునీలివర్, సన్ ఫార్మా, టైటాన్ షేర్లు పెద్ద ఎత్తున లాభాలను అందుకున్నాయి. అయితే టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికిల్స్, మారుతీ, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాలకే పరిమితమయ్యాయి. కాగా, గురువారం నుంచి ఇన్ఫోసిస్ రూ.18,000 కోట్ల షేర్ బైబ్యాక్ మొదలవుతుండటంతో మార్కెట్ సెంటిమెంట్ బలపడిందన్న అభిప్రాయాన్ని లెమన్ మార్కెట్స్ డెస్క్ రిసెర్చ్ అనలిస్ట్ గౌరవ్ గార్గ్ వ్యక్తం చేశారు. భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే వీలుందన్న అంచనాలూ దీనికి తోడయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాల వార్తలు ఆయా షేర్లను ఆకర్షణీయంగా మార్చాయన్న విశ్లేషణలూ ట్రేడింగ్ వర్గాల నుంచి ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో..
గ్లోబల్ మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్, హాంకాంగ్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. చైనా మాత్రం లాభపడింది. అయితే అంతర్జాతీయ మార్కెట్ల కదలికల ప్రభావం భారతీయ మార్కెట్లపై ఎక్కువగా లేదని మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అందుకు తాజా లాభాలే నిదర్శనమని చెప్తున్నారు. నిజానికి గత 6 రోజులుగా సూచీలు లాభాల్లోనే పరుగులు పెట్టాయి. అయితే మంగళవారం ఈ ర్యాలీకి బ్రేకులుపడ్డాయి. విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐలు) రూ.728.82 కోట్ల పెట్టుబడుల్ని వెనక్కి తీసుకున్నారు. అయితే దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) రూ.6,156.83 కోట్ల పెట్టుబడులు పెట్టారని స్టాక్ ఎక్సేంజ్ల గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి.