Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలతో ముగిశాయి. శుక్రవారం ట్రేడింగ్ అద్యంతం ఒడిదొడుకులకు గురైంది. మార్కెట్ లీడర్ రిలయన్స్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్), ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఫలితంగా రిలయన్స్ ఒకశాతం, హెచ్‌యూఎల్ నాలుగు శాతం, ఏషియన్ పెయింట్స్ మూడు శాతం, ఇన్పోసిస్ ఒక శాతం చొప్పున నష్టపోయాయి.
బీఎస్ఇ ఇండెక్స్ సెన్సెక్స్ 237 పాయింట్లు నష్టపోయి 60,622 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రా డే ట్రేడింగ్‌లో 61,001 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ అంతర్గత ట్రేడింగ్‌లో 18,145 పాయింట్లకు దూసుకెళ్లింది. చివరకు 80 పాయింట్లు కోల్పోయి 18,028 పాయింట్ల వద్ద స్థిర పడింది.
బజాజ్ ట్విన్స్, నెస్ట్లే, ఎల్ అండ్ టీ, భారతీ ఎయిర్టెల్, మారుతి, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్ వంటి స్టాక్స్ 1-3 శాతం మధ్య నష్టపోయాయి. మరోవైపు కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ ట్విన్స్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ స్క్రిప్ట్‌లు భారీగా లబ్ధి పొందాయి.
ఇక బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు 0.7 శాతం వరకు నష్టపోయాయి. నిఫ్టీలో కన్జూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ, మెటల్స్, రియాల్టీ, ఫార్మా ఇండెక్స్‌లు సుమారు ఒకశాతం చొప్పున నష్టపోగా, బ్యాంకింగ్, ఫైనాన్సియల్ ఇండెక్స్‌లు లాభ పడ్డాయి.