US Fed on Stocks | అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు రావడంతో ప్రత్యేకించి అమెరికా ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలతో వివిధ దేశాల స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు గురువారం లాభాలతో ముగిశాయి. రోజంతా ట్రేడింగ్‌లో పాజిటివ్ సంకేతాలతోనే సాగాయి. టెక్నాలజీ, ఫైనాన్సియల్ స్టాక్స్ కొనుగోళ్ల మద్దతుతో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ దూసుకెళ్లాయి. ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేయడానికి కీలక వడ్డీరేట్లు 75 బేసిక్ పాయింట్లు పెంచుతూ అమెరికా ఫెడ్ రిజర్వు తీసుకున్న నిర్ణయానికి అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి.
ఆసియా మార్కెట్లలో ఇన్వెస్టర్లు ఆచితూచి కొనుగోళ్లు సాగించారు. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 1041 పాయింట్ల లబ్ధితో 56,858 పాయింట్ల వద్ద ముగిస్తే, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 288 పాయింట్ల లాభంతో 16,930 పాయింట్ల వద్ద ముగిసింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ భారీగా లాభ పడ్డాయి. నిఫ్టీ మిడ్ క్యాప్-100 0.84, స్మాల్ క్యాప్ 0.85 శాతం వృద్ధి చెందాయి.
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ)లోని 15 సెక్టార్ల స్టాక్స్ లాభపడ్డాయి. నిఫ్టీ ఐటీ 2.81, నిఫ్టీ ఫైనాన్సియల్ సర్వీసెస్ స్టాక్స్ 2.41 శాతం లాభాలతో ముగిసాయి. నిఫ్టీలో బజాజ్ ఫైనాన్స్ గరిష్టంగా 10.46 శాతం లాభ పడి రూ.7,065.50 వద్ద ముగిసింది. బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ తదితర స్క్రిప్ట్‌లు లాభ పడ్డాయి. బీఎస్ఈలో 1910 షేర్లు లాభాలతో ముగియగా, 1429 స్టాక్స్ నష్టపోయాయి.
బీఎస్ఈలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, నెస్ట్లే ఇండియా, విప్రో, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తదితర షేర్లు 10.68 శాతం వరకు లాభ పడ్డాయి. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) షేర్లు 0.12 శాతం లాభంంతో రూ.675.30 వద్ద ముగిశాయి.
మరోవైపు భారతీ ఎయిర్టెల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్, ఐటీసీ, సన్‌ఫార్మా షేర్లు నష్టపోయాయి. ఎనిమిది వారాల పాటు 50 శాతం సర్వీసులు మాత్రమే నడుపాలని స్పైస్‌జెట్‌ను డీజీసీఏ ఆదేశించింది. ఇటీవల పలు సాంకేతిక లోపాలతో విమానాలు అత్యవసర ల్యాండింగ్ అవుతుండటంతో డీజీసీఏ తీసుకున్న నిర్ణయం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలహీన పరిచింది. ఫలితంగా స్పైస్‌జెట్ షేర్లు 3.52 శాతం నష్టంతో ముగిశాయి. ఇంట్రా డే ట్రేడింగ్‌లో స్పైస్‌జెట్ స్క్రిప్ట్ 9.66 శాతం నష్టపోయి 52 వారాల కనిష్ట స్థాయిని తాకి రూ.34.60 వద్ద నిలిచింది.