ముంబై, డిసెంబర్ 4: మూడు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో సోమవారం స్టాక్ మార్కెట్ పెద్ద ఎత్తున ర్యాలీ జరిపి పలు రికార్డులు నెలకొల్పింది. రెండు ప్రధాన సూచీలు ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయిని అందుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ అవలీలగా 68వేల శిఖరంపై పాగా వేయగా, నిఫ్టీ 20,600 పాయింట్ల స్థాయిని అధిగమించింది. సెన్సెక్స్ 1,384 పాయింట్లు (2 శాతం) లాభపడి 68,918 పాయింట్ల వద ముగియగా, నిఫ్టీ 419 పాయింట్లు ఎగిసి 20,687 పాయింట్ల వద్ద నిలిచింది.
2022 మే 20 తర్వాత ఇంత పెద్ద ర్యాలీ జరగడం ఇదే ప్రధమం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో పాజిటివ్ సెంటిమెంట్ నెలకొందని, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరపడం, బ్రెంట్ క్రూడ్ ధర 80 డాలర్ల దిగువకు తగ్గడం ర్యాలీకి తోడ్పడ్డాయని విశ్లేషకులు తెలిపారు. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాలు ర్యాలీకి పురికొల్పాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.
బ్యాంక్‌లకు భారీ లాభాలు
తాజా మార్కెట్ ర్యాలీకి బ్యాంక్‌లు నేతృత్వం వహించాయి. సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా ఐసీఐసీఐ బ్యాంక్ 4.68 శాతం, ఎస్బీఐ 3.99 చొప్పున పెరిగాయి. కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు సైతం 3 శాతంపైగా లాభపడ్డాయి. బ్యాంక్‌లతో పాటు ఇంజనీరింగ్ దిగ్గజం లార్సన్ అండ్ టుబ్రో 3.9 శాతం పెరిగి కొత్త రికార్డుస్థాయి 3,316 వద్ద ముగిసింది. లార్జ్‌క్యాప్ షేర్లతో పోలిస్తే మిడ్, స్మాల్‌క్యాప్ షేర్ల ర్యాలీ పరిమితంగా ఉంది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.19 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.20 శాతం చొప్పున పెరిగాయి. వివిధ రంగాల సూచీల లాభాల్ని పరిశీలిస్తే అత్యధికంగా ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 3.77 శాతం పెరగ్గా, బ్యాంకెక్స్ 3.56 శాతం ఎగిసింది.
పవర్ ఇండెక్స్ 2.99 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచి 2.98 శాతం, యుటిలిటీస్ 2.94 శాతం చొప్పున పెరిగాయి. దాదాపు అన్ని రంగాల షేర్లూ ర్యాలీలో పాలుపంచుకున్నాయని, బ్యాంకింగ్ దిగ్గజాలు గరిష్ఠలాభాల్ని సాధించాయని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. వచ్చే కొద్ది రోజుల్లో స్మాల్, మిడ్‌క్యాప్‌లను లార్జ్‌క్యాప్ షేర్లు అవుట్పెర్ఫార్మ్ చేస్తాయని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ బిజినెస్ హెడ్ జయకృష్ణ గాంధి అన్నారు. బ్యాంకింగ్ షేర్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్‌పై బుల్లిష్ అంచనాల్ని వెల్లడించారు.
సంస్థాగత ఇన్వెస్టర్ల కొనుగోళ్లు
ఇటు దేశీయ సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, అటు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లు జరిపారు. స్టాక్ ఎక్సేంజీల సమాచారం ప్రకారం సోమవారం విదేశీ ఇన్వెస్టర్లు రూ. 2,073 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేయగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు అంతకు రెట్టింపునకు పైగా రూ. 4,797 కోట్లు పెట్టుబడి చేశారు.
రూ.5.81 లక్షల కోట్లు పెరిగిన సంపద
సోమవారం ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద రూ.5.81 లక్షల కోట్ల మేర పెరిగింది. బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ కొత్త రికార్డుస్థాయి రూ.343.48 లక్షల కోట్లకు చేరింది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద రూ.14.76 లక్షల కోట్లు పెరిగింది. డాలర్ల రూపేణా గత శుక్రవారమే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ తొలిసారిగా 4 ట్రిలియన్ డాలర్లను అధిగమించిన సంగతి తెలిసిందే.
నిఫ్టీ 21,000 దిశగా
నిఫ్టీ భారీ గ్యాప్‌అప్‌తో ప్రారంభమై, ముగింపు సమయానికి మరింత పెరగడం సాంకేతికంగా సానుకూలాంశమని, వచ్చే కొద్ది రోజుల్లో ర్యాలీ కొనసాగే అవకాశం ఉందని ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ రూపక్ డే చెప్పారు. పుట్ ఆప్షన్ పొజిషన్లు హయ్యర్ స్ట్రైక్ స్థాయిలకు మారిన నేపథ్యంలో సమీప భవిష్యత్తులో మరిన్ని లాభాల్ని చూసే ఛాన్స్ ఉందని అంచనా వేశారు. 20,400 దిగువకు తగ్గనంతవరకూ నిఫ్టీ 21,000 స్థాయిని అందుకునే అవకాశాలున్నాయని విశ్లేషించారు.