ముంబై, అక్టోబర్ 7 : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో కళకళలాడుతున్నాయి. వరుసగా నాలుగోరోజూ మంగళవారం కూడా సూచీలు భారీగా లాభపడ్డాయి. బ్లూచిప్ సంస్థల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతోపాటు దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా కొనుగోళ్లు జరపడం సూచీల్లో జోష్ పెంచింది. లాభాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ట్రెండ్‌ను కొనసాగించింది. ఇంట్రాడేలో 500 పాయింట్లకు పైగా ఎగబాకిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 82 వేల పాయింట్ల మైలురాయిని అధిగమించింది.
మధ్యాహ్నాం తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు ఈ భారీ లాభాలను నిలుపుకోలేకపోయింది. చివరకు 136.63 పాయింట్లు అందుకొని 81,926.75 వద్ద ముగిసింది. నిఫ్టీ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ప్రారంభంలో భారీగా లాభపడిన సూచీ చివరకు 30.65 పాయింట్లు మాత్రమే పెరిగి 25,108.30 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు మదుపరులను కొనుగోళ్ల వైపు నడిపించాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.