Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం వరుసగా ఆరో సెషన్లో నష్టాలతో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల యుద్ధం.. అమెరికా డాలర్ ప్లస్ యూఎస్ బాండ్లు బలోపేతం కావడంతో దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు వాటాలు ఉపసంహరిస్తుండటంతో దేశీయ మదుపర్లలో సెంటిమెంట్ బలహీన పడింది.
ఫలితంగా బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో 905.21 పాయింట్ల పతనంతో 76 వేల పాయింట్ల దిగువన 75,388.39 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి ఫైనాన్సియల్ స్టాక్స్ రికవరీతో 122.52 పాయింట్ల నష్టంతో 76,171.08 పాయింట్లతో సరి పెట్టుకున్నది.
మరోవైపు ఎన్ఎస్ఈ-50 సూచీ నిఫ్టీ 26.55 పాయింట్లు (0.12 శాతం) కోల్పోయి 23,045.25 పాయింట్ల వద్ద స్థిర పడింది. అంతర్గత ట్రేడింగ్‌లో 273.45 పాయింట్లు (1.18 శాతం) నష్టంతో 22,798.35 పాయింట్లకు చేరుకుని కీలక 23,000 మార్క్ దిగువకు చేరుకుంది. ఈ నెల నాలుగో తేదీ నుంచి బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 2,412.73 పాయింట్లు (3.07 శాతం), ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 694 పాయింట్లు (2.92 శాతం) నష్టపోయాయి.
బీఎస్ఈ-30 సెన్సెక్స్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ, పవర్‌గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, టైటాన్, ఇన్ఫోసిస్ భారీగా నస్టపోయాయి. మరోవైపు బజాజ్ ఫిన్ సర్వ్, టాటా స్టీల్, లార్సెన్ అండ్ టర్బో, ఆల్ట్రా టెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా మోటార్స్ తదితర షేర్లు లాభ పడ్డాయి. మంగళవారం నాటికి దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 4,486.41 కోట్ల విలువైన వాటాలను ఉపసంహరించారు.
జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ స్పందిస్తూ ‘దేశీయ మార్కెట్లో ఇంట్రాడే భారీ నష్టాల నుంచి ట్రేడింగ్ ముగింపుకల్లా స్వల్ప రికవరీ నమోదైంది. బ్రాడర్ మార్కెట్ పుంజుకున్నాఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఓవరాల్‌గా బలహీనంగా ఉంది. మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు సంఘటితమయ్యే దిశగా ప్రయాణిస్తాయని భావిస్తున్నారు’ అని చెప్పారు. అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలు భవిష్యత్ మార్కెట్ల గమనాన్ని నిర్దేశిస్తాయన్నారు.
ఏషియన్ మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు పాజిటివ్‌గా ముగుస్తాయి. యూరోపియన్ యూనియన్ మార్కెట్లు లాభాలతో ముగుస్తాయి. మంగళవారం అమెరికా మార్కెట్లు అత్యధికంగా లాభాలతో స్థిర పడ్డాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్‌పై 0.78 శాతం పతనమై 76.40 డాలర్లకు చేరుకుంది.