ముంబై, జూలై 15 : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్ షేర్ల నుంచి లభించిన మద్దతుతోపాటు అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు ఆశాజనకంగా ఉంటాయన్న అంచనాతో ఫెడరల్ రిజర్వు దూకుడుతో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండటం మదుపర్లులో విశ్వాసాన్ని పెంచింది. ఫలితంగా కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో ఇంట్రాడేలో 600 పాయింట్ల వరకు లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 130.49 పాయింట్లు లాభపడి 77,185.43 వద్ద స్థిరపడింది.
మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 26.45 పాయింట్లు అందుకొని 24,078.50 వద్ద ముగిసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడం విశేషం. ఈ సూచీల్లో ఎటర్నల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ముగియగా..పవర్ గ్రిడ్, ఎల్ అండ్ టీ, టాటా స్టీల్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టపోయాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయని, ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో చివర్లో కోలుకున్నాయని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.