Stocks | వివిధ దేశాలపై అమెరికా టారిఫ్‌లతో అంతర్జాతీయంగా భారీ స్థాయిలో అనిశ్చితి కొనసాగుతుండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీన పడింది. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో శుక్రవారం ప్రారంభ లాభాలు ఆవిరయ్యాయి. ఈక్విటీ మార్కెట్లలో వరుసగా రెండు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 7.51 పాయింట్ల పతనంతో 74,332.58 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో మిడ్ సెషన్లో 246.34 పాయింట్లు లాభ పడి 74,586.43 పాయింట్ల గరిష్టానికి దూసుకెళ్లింది. మరోవైపు, ఎన్ఎస్ఈ-50 సూచీ నిఫ్టీ 7.80 పాయింట్లు వృద్ధి చెంది 22,552.50 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్గత ట్రేడింగ్‌లో నిఫ్టీ 89 పాయింట్ల వృద్ధితో 22,633.80 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరుకుంది.
బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్‌లో జొమాటో, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టైటాన్, పవర్ గ్రిడ్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్), టెక్ మహీంద్రా, ఐటీసీ తదితర స్టాక్స్ లాభ పడ్డాయి. మరోవైపు, రిలయన్స్ ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్ తదితర స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. ఏషియన్ మార్కెట్లలో టోక్యో, షాంఘై, హాంకాంగ్, సియోల్ మార్కెట్లు, యూరోపియన్ మార్కెట్లు నష్టాలతో స్థిర పడ్డాయి. వాల్ స్ట్రీట్ గురువారం నష్టాలతో ముగిసింది.
దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి గురువారం వరకూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 2,377.32 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు. మరోవైపు దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,617.80 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 1.32 శాతం వృద్ధి చెంది 70.38 డాలర్లు పలికింది.