ముంబై, జూన్ 19 : దేశీయ స్టాక్ మార్కెట్లకు ఐటీ షేర్ల సెగ గట్టిగానే తాకింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ సంస్థల వృద్ధి సింగిల్ డిజిట్ కంటే తక్కువ స్థాయిలో ఉండనున్నట్టు వచ్చిన అంచనాలు ఆయా రంగ షేర్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఫలితంగా గత ఐదు రోజులుగా భారీగా పుంజుకున్న స్టాక్ మార్కెట్లను నష్టాల్లోకి నెట్టాయి. అంతర్జాతీయ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ తన ఆదాయ, లాభాల అంచనాలను తగ్గించడంతోపాటు అంతర్జాతీయంగా మళ్లీ అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం, అమెరికా-ఇరాన్ దేశాల మధ్య చర్చలు వాయిదాపడటం మార్కెట్లో సెంటిమెంట్‌ను నీరుగార్చింది. మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో వారాంతపు ట్రేడింగ్‌లో ఇరు సూచీలు ఒక్క శాతం వరకు పతనం చెందాయి. ఇంట్రాడేలో 900 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 607.08 పాయింట్లు కోల్పోయి 76,802.90 వద్ద నిలిచింది. నిఫ్టీ 154.90 పాయింట్లు పతనం చెంది 24,013.10 వద్ద స్థిరపడింది.
రిలయన్స్ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. జియో ఐపీవోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించడంతో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఇంట్రాడేలో 1.67 శాతం వరకు నష్టపోయిన రిలయన్స్ షేరు చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 1.39 శాతం కోల్పోయి రూ.1,309.35 వద్ద నిలిచింది. అటు ఎన్ఎస్ఈలోనూ సూచీ 1.40 శాతం తగ్గి రూ.1,309.50 వద్ద నిలిచింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.24,891.09 కోట్లు కరిగిపోయి రూ.17,71,882.96 కోట్లకు పరిమితమైంది.