ముంబై, జూన్ 27: దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతోపాటు క్రూడాయిల్ ధరలు పతనం చెందడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను కుమ్మరించడంతో ఈవారం మొత్తం సూచీలు లాభాల్లో కదలాడాయి. వరుసగా నాలుగో రోజూ శుక్రవారం సూచీలు అర శాతం వరకు లాభపడ్డాయి. 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ తిరిగి 84 వేల మార్క్ మైలురాయిని అధిగమించింది. ఇంట్రాడేలో 333 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ చివరకు 303.03 పాయింట్లు అందుకొని 84,058.90 వద్ద ముగిసింది. గత నాలుగు సెషన్లలో సూచీ 2,162.11 పాయింట్లు లేదా 2.64 శాతం ఎగబాకింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ విలువ రూ.12,26,717.72 కోట్లు పెరిగి రూ.4,60,09,217.58 కోట్లు(5.38 ట్రిలియన్ డాలర్లు) చేరుకున్నది. మరో సూచీ నిఫ్టీ 88.80 పాయింట్లు అందుకొని 25,637.80 పాయింట్ల ముగిసింది. ఇరాన్-ఇజ్రాయిల్ సీజ్ఫైర్ ప్రకటించడం, అమెరికా-భారత్ దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలో కుదిరే అవకాశాలుండటంతో ఈవారంలో ఇరు సూచీలు రెండు శాతం వరకు లాభపడ్డాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.