Sensex 2021 | ఒకవైపు కరోనా న్యూవేరియంట్ ఒమిక్రాన్ భయాలు.. మరోవైపు ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు వెంటాడుతున్నా.. 2021 చివరి రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు పాజిటివ్ నోట్‌తో ముగిశాయి. ఆటో, ఫైనాన్సియల్స్, ఎఫ్ఎంసీజీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు రోజంతా పైపైకి దూసుకెళ్లాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 460 పాయింట్ల లబ్ధితో 58,254 పాయింట్ల వద్ద ముగిసింది. అంతకుముందు ట్రేడింగ్‌లో 58,409 పాయింట్ల ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ వారంలో సెన్సెక్స్ 1130 పాయింట్లు పైపైకి దూసుకెళ్లింది.
బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ అక్టోబర్ 19న న్యూ లైఫ్ టైం హై రికార్డు 62,245 పాయింట్లకు చేరుకున్నది. తద్వారా సెన్సెక్స్ ఈ ఏడాది 22 శాతం (10,503 పాయింట్లు లబ్ధి పొందింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ కూడా 150 పాయింట్ల లబ్ధితో 17,354 పాయింట్ల వద్ద ముగిసింది. 2021లో 24.1 శాతం లాభ పడింది. సెన్సెక్స్‌లో టైటాన్ స్క్రిప్ట్ 3.5 శాతం పెరిగి రూ.2,522 వద్ద నిలిచింది.
అల్ట్రాటెక్ సిమెంట్, కొటక్ మహీంద్రా బ్యాంకు స్క్రిప్ట్‌లు సుమారు 2.5 శాతం పెరిగాయి. మారుతి సుజుకి, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్సర్వ్, హిందూస్థాన్ యూనీ లివర్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, నెస్ట్లే, సన్‌ఫార్మా భారీగా లబ్ధి పొందాయి. అందుకు భిన్నంగా ఐటీ స్టాక్స్‌పై ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇచ్చారు.
బీఎస్ఈ మిడ్ క్యాప్ 1.4 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1.2 శాతం లబ్ధి పొందాయి. దుస్తులపై జీఎస్టీ పెంచాలన్న అంశంపై జీఎస్టీ కౌన్సిల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో నిర్ణయాన్ని వాయిదా వేశారు. దీంతో టెక్స్టైల్స్ స్క్రిప్ట్‌లు లాభాలు గడించాయి.