ముంబై, డిసెంబర్ 16: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాలోకి జారుకున్నాయి. ఈ వారంలో వడ్డీరేట్లపై అమెరికా ఫెడరల్ రిజర్వు నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా ఐటీ, మెటల్ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడంతో సెన్సెక్స్ 82 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది.
వీటికితోడు చైనా ఆర్థిక వ్యవస్థ మరింత బలహీనపడుతుండటం, రూపాయి మారకం విలువ చారిత్రక కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో మదుపరుల్లో సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో ఒక దశలో 600 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 384.55 పాయింట్లు కోల్పోయి 81,748.57 వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ 100 పాయింట్లు కోల్పోయి 24,668.25 వద్ద ముగిసింది.
ఆసియా, యూరోపియన్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకోగా, అమెరికా ఫెడ్ సమావేశం నిర్ణయం కోసం మదుపరులు వేచి చూసే దోరణి అవలంభించడం వల్లనే సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. సూచీల్లో టైటాన్, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు నష్టపోయాయి.