ముంబై, డిసెంబర్ 18: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్‌పడింది. పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గుచూపడంతో రికార్డు స్థాయి నుంచి వెనక్కితగ్గాయి. ఆసియా మార్కెట్లు బలహీనంగా ట్రేడవడం కూడా మార్కెట్ల పతనానికి ఆజ్యంపోశాయి. ఒక దశలో 300 పాయింట్లకు పైగా నష్టపోయి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 168.66 పాయింట్లు కోల్పోయి 71,315.09 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌తోపాటు నిఫ్టీ కూడా 38 పాయింట్లు కోల్పోయి 21,418.65 వద్ద నిలిచింది.
2024లో 22 వేలకు నిఫ్టీ
వచ్చే ఏడాది కూడా నిఫ్టీ 21 వేల పాయింట్ల పైన్నే కదలాడనున్నదని కొటక్ సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. 2024 చివరినాటికి నిఫ్టీ 21,834 పాయింట్ల స్థాయిలో కదలానున్నదని తన అవుట్‌లుక్‌లో పేర్కొంది. 2023లో 13 శాతం పెరిగిన సూచీ వచ్చే ఏడాది మాత్రం రెండు శాతం వృద్ధిని సాధించనున్నదని అంచనావేస్తున్నది. అలాగే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు 39 శాతం, 48 శాతం చొప్పున బలపడనున్నాయని సోమవారం విడుదల చేసిన అవుట్‌లుక్ 2024లో పేర్కొంది.
చమురు సరఫరాలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలున్నాయన్న అంచనాలు మదుపరులపై ప్రతికూల ప్రభావం చూపాయి.
ప్రారంభంలో భారీగా నష్టపోయిన సూచీలు.. మధ్యాహ్నం తర్వాత విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన దన్నుతో కోలుకోగలిగాయి.
– వినోద్ నాయర్, జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్