Stocks | విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) రోజు అమ్మకాలకు దిగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్ గురువారం నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ -30 ఇండెక్స్ సెన్సెక్స్ 110.64 పాయింట్లు నష్టపోయి 77,580.31 పాయింట్ల వద్ద ముగిసింది. గురువారం ఉదయం ట్రేడింగ్ పాజిటివ్ నోట్ తో ప్రారంభమైనా చివరకు నష్టాలతో స్థిర పడింది. ఇంట్రాడే ట్రేడింగ్ లో 266.14 పాయింట్లు నష్టపోయి 77,424.81 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 26.35 పాయింట్లు పతనమై 23,532.70 పాయింట్ల వద్ద నిలిచింది. వరుసగా ఆరో రోజూ నష్టాలతో ముగిసింది. బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్‌లో హిందూస్థాన్ యూనీ లివర్, ఎన్టీపీసీ, నెస్లే, ఇండస్ఇండ్ బ్యాంకు, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్ తదితర సంస్థలు నష్టపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంకు లాభ పడ్డాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు బుధవారం రూ.2502.58 కోట్ల విలువైన షేర్లు విక్రయించగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.6,145.24 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు.