Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు తొలిసారిగా జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి. సెన్సెక్స్ తొలిసారిగా 83వేల మార్క్‌ను దాటింది. నిఫ్టీ 25,433.35 పాయింట్ల మార్క్‌ను అందుకున్నది. సెన్సెక్స్, నిఫ్టీ రెండు గరిష్ఠ స్థాయిలో ముగిశాయి. దేశీయ మార్కెట్లో పెట్టుబడులు పెరిగాయి. ఈ క్రమంలో మార్కెట్లు ఒక్కసారిగా కొత్త ఊపునిచ్చింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్, ఎయిర్టెల్, ఇన్ఫోసిస్ షేర్లు మద్దతు ఇచ్చాయి. ఉదయం సెన్సెక్స్ 81,930.18 పాయింట్ల వద్ద మొదలైంది. పొద్దంతా ఊగిసలాడిన మార్కెట్లు చివరి సెషన్లో ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిశాయి. ఇంట్రాడేలో ఒక దశలో 81,534.29 పాయింట్ల కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. అత్యధికంగా 83,116.19 పాయింట్లకు చేరి సరికొత్త రికార్డును సృష్టించింది.
చివరకు 1,439.55 పాయింట్ల లాభంతో 82,962.71 వద్ద ముగిసింది. నిఫ్టీ 470.45 పాయింట్లు పెరిగి 25,388.90 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో దాదాపు 2,228 షేర్లు పురోగమించగా.. 1,564 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో హిందాల్కో, భారతీయ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, శ్రీరామ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐచర్ మోటార్స్, ఓఎన్జీసీ, విప్రో, అదానీ పోర్ట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లాభాలను నమోదు చేశాయి. గ్రాన్యూల్స్ ఇండియా, ప్రిసం జాన్సన్, రేమాండ్స్, బయోకాన్, ఆర్ఆర్ కబెల్ నష్టాల్లో ముగిశాయి. మెటల్స్, ఆటోమొబైల్స్, క్యాపిటల్ గూడ్స్, టెక్నాలజీ, పవర్ రంగాలు 2-4 శాతం పెరిగాయి. ఇక బీఎస్ఈలో నమోదిత కంపెనీల విలువ రూ.7 లక్షల కోట్లు పెరిగి.. రూ.466 లక్షల కోట్లకు పెరిగింది.